Teenmar Mallanna| కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న(Teenmar Mallanna) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల తరువాత తెలంగాణలో రేవంత్ రెడ్డి(Revanth Reddy) ప్రభుత్వాన్ని కూల్చడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ ఆరోపించారు. రాష్ట్రంలోని ఓ మంత్రి బీజేపీతో టచ్‌లోకి పోయారని తెలిపారు. మహారాష్ట్రలో ఏక్‌నాథ్ షిండేలా ఆ మంత్రి వ్యవహరిస్తారంటూ వెల్లడించారు. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చి.. బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తారని వెల్లడించారు. ప్రస్తుతం తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
కాగా ఇటీవల నల్గొండలో జరిగిన బీసీల సమావేశంలో జిల్లాలెని రెడ్డి ఎమ్మెల్యేలపై కూడా వివాదస్పద వ్యాఖ్యలు చేశారు మల్లన్న. బీసీల ఓట్లతో గెలిచిన రెడ్డీలు.. అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలను పట్టించుకోడం లేదంటూ మండిపడ్డారు. అలాగే త్వరలోనే రాష్ట్రంలో బీసీల ప్రభుత్వం వస్తుందంటూ స్పష్టంచేశారు. బీసీల ఐక్యతను ఎవరు దెబ్బతీయలేరని వ్యాఖ్యానించారు. మొత్తానికి కాంగ్రెస్ పార్టీలో తీన్మార్ మల్లన్న వ్యవహారం తీవ్ర వివాదాస్పదంగా మారింది.