తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం మూసి పునరుజ్జీవం ప్రాజెక్టును ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా రేపు (నవంబర్ 8 న) సీఎం రేవంత్ రెడ్డి మూసి పునరుజ్జీవ పాదయాత్ర చేయునున్నారు. వలిగొండ నుంచి బీబీనగర్ వరకు ఆరు కిలోమీటర్ల మేర మూసీ వెంట ఉన్న ప్రజలను నేరుగా కలుసుకోనున్నారు. అక్కడ నివసించే ప్రజల ఇబ్బందులను స్వయంగా తెలుసుకునేందుకు ఈ పాదయాత్ర చేపడుతున్నట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో భవనగిరి కాంగ్రెస్ ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా గత బిఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కేసీఆర్ (KCR), కేటీఆర్ (KTR) లకు ఒక ఛాలెంజ్ కూడా చేశారు.
గ్లాస్ నీళ్లు తాగండి..
ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ… లక్షల కోట్లు అప్పులు చేసి కూలిపోయే ప్రాజెక్టులు కట్టారని బీఆర్ఎస్ పై విమర్శలు గుప్పించారు. మూసీ ప్రక్షాళన చేస్తామని సీఎం కాకముందే చెప్పిన కేసీఆర్.. అధికారంలో ఉన్న పదేళ్లు కాలయాపన చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డిపిఆర్ కూడా మొదలు కాని ప్రాజెక్టుల్లో కమీషన్ల కోసమని జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారని నిప్పులు చెరిగారు. కేసీఆర్ (KCR), కేటీఆర్ (KTR) గంటసేపు మూసీలో నిలబడి ఒక గ్లాస్ నీళ్లు తాగాలని ఛాలెంజ్ చేశారు. రేపు జరగనున్న సీఎం రేవంత్ రెడ్డి మూసీ పునరుజ్జీవ పాదయాత్రకు ప్రజలు స్వచ్ఛందంగా తరలివస్తారని ధీమా వ్యక్తం చేశారు.
వాస్తవాలు తెలిపేందుకే పాదయాత్ర…
ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రతిపక్షాలకు వాస్తవాలు తెలిపేందుకే సీఎం రేవంత్ మూసీకి వస్తున్నారని వెల్లడించారు. గత ప్రభుత్వం ప్రతిపక్షాలను నిర్వీర్యం చేసి లక్షల కోట్లు అప్పులు చేసిందని ఆగ్రహించారు. మూసీ ప్రక్షాళన చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి చిత్తశుద్ధితో ముందుకు వెళుతున్నారు అని తెలిపారు. ప్రతిపక్షాలు పది నెలల కాంగ్రెస్ పాలనపై ప్రజలను రెచ్చగొట్టేలా తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.