CM Revanth Reddy| తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ పథకాన్ని మహిళలు చక్కగా వినియోగించుకుంటున్నారు. దూరం భారం పనులకు వెళ్లే మహిళలకు ఈ పథకం చాలా ఉపయోగపడుతుంది. దీంతో మహిళలు ఉపాధి కోసం పనులకు వెళ్లడం పెరిగింది. ఈ నేపథ్యంలో ఉచిత బస్సు ప్రయాణాన్ని విద్యార్థినిలు ఎలా ఉపయోగించుకుంటున్నారో ఓ మహిళా కండక్టర్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. ఈ ట్వీట్‌కు సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పందించడం విశేషం.
మాధవరపు రమాలక్ష్మీ అనే మహిళా కండక్టర్ ఎక్స్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. “నమస్కారం రేవంత్ రెడ్డి సార్. ఈ పిల్లలు మహాలక్ష్మి పథకాన్ని ఉపయోగించుకుని గ్రౌండ్‌కు వెళ్ళి చక్కగా గేమ్స్ నేర్చుకుంటున్నారు. మహాలక్ష్మి పథకం ఆడపిల్లలు చాలా ధైర్యంగా ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. మీకు ధన్యవాదాలు సార్” అంటూ పిల్లలతో కలిసి మహిళలతో దిగిన ఫొటోను షేర్ చేసుకున్నారు.
తాజాగా కండక్టర్ ట్వీట్‌పై సీఎం రేవంత్ రెడ్డి స్పందిస్తూ ట్వీట్ చేశారు. “ఆడబిడ్డల ఆకాంక్షలను నెరవేర్చాలన్న సంకల్పంతో కాంగ్రెస్ పార్టీ ‘మహాలక్ష్మీ’ పథకాన్ని తీసుకొచ్చింది. ఈ మహాలక్ష్మీలను చూస్తుంటే.. ఆ పథకం ఉద్దేశం నెరవేరుతోందన్న విషయం అర్థమవుతోంది. చాలా సంతోషం..ఆ పిల్లలు భవిష్యత్‌లో ఉన్నత స్థాయికి ఎదగాలని, వారి లక్ష్యాలను చేరాలని ఆకాంక్షిస్తున్నాను” అని పేర్కొన్నారు.