కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ఫార్మాసిటీ (Pharma City) వ్యతిరేక పోరాట కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు కమిటీ సభ్యులు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. గతంలో ఫార్మా సిటీలో పర్యటించిన కాంగ్రెస్ నాయకులు మేము అధికారంలోకి వస్తే ఫార్మాసిటీని రద్దు చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. ఇవ్వని భూములను ఎట్టి పరిస్థితుల్లో తీసుకోమని చెప్పారని గుర్తు చేశారు. మూడు పంటలు పండే భూములను ఎవరూ ఇవ్వొద్దని, మీకు అండగా ఉంటామని చెప్పిన కాంగ్రెస్ నాయకులు.. ఇప్పుడు ఫోర్త్ సిటీ, గ్రీన్ ఫార్మా అని భూములు ఇవ్వాలని బెదిరిస్తున్నారని ఆరోపించారు.
Also Read : ‘రేవంత్ సీఎం అయితే కేటీఆర్ యాక్టింగ్ సీఎం’
కాంగ్రెస్ మేనిఫెస్టోలో చెప్పినట్టు ఫార్మాసిటీ రద్దు, ఇవ్వని భూములను తీసుకోము అనే అంశాలకు కట్టుబడి ఉండాలని కమిటీ డిమాండ్ చేసింది. ఇప్పటికే ఫార్మాసిటీ (Pharma City) రద్దుకై సీఎం రేవంత్ రెడ్డికి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకి, ఐటి మినిష్టర్ శ్రీధర్ బాబుకి, మంత్రి సీతక్కకి, రైతు కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డికి ప్రజపాలనలో వినతిపత్రాలు కూడా సమర్పించామని కమిటీ వెల్లడించింది. అయితే వారి నుండి ఇప్పటివరకు ఎలాంటి సమాధానం రాలేదని కమిటీ ఆవేదన వ్యక్తం చేసింది.
రైతు కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి గతంలో ఏ విధంగా రైతు పక్షాన నిలబడి పోరాటం చేశారో.. ఇప్పుడు కూడా రైతుల కోసం ఫార్మాసిటీ రద్దు, భూసేకరణ రద్దు చేయడం కోసం అదే విధంగా పోరాటం చేయాలని ఫార్మాసిటీ వ్యతిరేక పోరాట కమిటీ కోరింది. తమ కమిటీ కొత్తగా ఏర్పాటు అయిందని, త్వరలోనే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి కార్యాచరణ రూపొందిస్తామని కమిటీ సభ్యులు ప్రకటనలో వెల్లడించారు.