YCP MLA| వైసీపీ పార్టీకి వరుస షాక్‌లు తగులుతూనే ఉన్నాయి. ఇప్పటికే ఆ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలపై కేసులు నమోదుచేస్తున్న పోలీసులు.. తాజాగా యర్రగొండపాలెం వైసీపీ ఎమ్మెల్మే తాటిపర్తి చంద్రశేఖర్(Tathiparthi Chandrasekhar)పై కేసు నమోదుచేశారు. రెండు నెలల క్రితం మంత్రి నారా లోకేష్‌పై ఆయన ఎక్స్ వేదికంగా తీవ్ర ఆరోపణలు చేశారు. “వారం వారం పేకాట క్లబ్బులు.. లోకేష్‌కు అందులో వాటా” అంటూ ఆరోపిస్తూ ఓ పోస్ట్ పెట్టారు. అయితే తాజాగా దీనిపై స్థానిక కౌన్సిలర్ యర్రగొండపాలెం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదుచేశారు.
ఈ ఫిర్యాదు మేరకు తాటిపర్తి చంద్రశేఖర్‌పై కేసు నమోదుచేశారు. 41 సీఆర్పీసీ(CRPC) కింద నోటీసులు జారీ చేశారు. ఇప్పటికే నియోజకవర్గంలోని ఐదు మండలాల్లోని పోలీస్ స్టేషన్లలో ఆయనపై పలు కేసులు నమోదయ్యాయి. ఈ కేసులపై చంద్రశేఖర్ స్పందిస్తూ.. ప్రభుత్వం తనపై కుట్ర పన్నిందని మండిపడ్డారు. దీనిపై న్యాయపరంగా పోరాటం చేస్తామని తెలిపారు. కాగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వంపై అసభ్యకర పోస్టులు పెడుతున్న వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు.
ఇదిలా ఉంటే వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టుపై ఏపీ హైకోర్టు సీరియస్ అయింది. చట్ట నిబంధనలు పాటించకుంటే తాము జోక్యం చేసుకోవాల్సి వస్తుందని పోలీసులను హెచ్చరించింది. పౌరుల స్వేచ్ఛను తేలికగా తీసుకోవద్దని సూచించింది. పలు బాధిత కుటుంబాల హెబియస్ కార్పస్ పిటిషన్లపై విచారణ చేసిన న్యాయస్థానం ఈమేరకు వ్యాఖ్యలు చేసింది.