TG High Court| తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత(MLAs Disqualification) పిటిషన్‌పై తీర్పు రిజర్వ్ అయింది. ఈ కేసులో అసెంబ్లీ కార్యదర్శి దాఖలు చేసిన అప్పీల్ పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు జరిగాయి. బీఆర్ఎస్ పార్టీ తరుపున సీనియర్ న్యాయవాది గండ్ర మోహన్‌రావు వాదనలు వినిపించగా.. ఫిరాయింపు ఎమ్మెల్యేల తరుపున న్యాయవాది మయూర్ రెడ్డి వాదనలు వినిపించారు.
సింగిల్ జడ్జి తీర్పుపై అప్పీల్ చేసే అర్హత అసెంబ్లీ కార్యదర్శికి లేదని బీఆర్ఎస్ న్యాయవాది వాదించారు. అనర్హత పిటిషన్లపై స్పీకర్ సకాలంలో నిర్ణయం తీసుకోవాల్సి ఉందని పేర్కొన్నారు. ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది.
కాగా ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణీత వ్యవధిలో నిర్ణయం తీసుకోవాలని గతంలో సింగిల్ బెంచ్ తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే సింగిల్ బెంచ్ తీర్పును అసెంబ్లీ కార్యదర్శి డివిజన్ బెంచ్ ముందు సవాల్ చేశారు. ఇదిలా ఉంటే బీఆర్ఎస్ నుంచి పది మంది ఎమ్మెల్యేలు ఇప్పటికే కాంగ్రెస్ కండువా కప్పుకున్న విషయం విధితమే. వీరిలో దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరి, సంజయ్ కుమార్, అరికపూడి గాంధీ, ప్రకాష్ గౌడ్ తదితరులు ఉన్నారు.