మహారాష్ట్ర రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల వేళ ఓట్ జిహాద్ (Vote Zihad) అంశం సంచలనంగా మారింది. మహారాష్ట్రలో ప్రతిపక్షాలు హవాలా డబ్బుతో వోట్ జిహాద్ కి తెరలేపారని బీజేపీ నేతలు పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు. ఆరోపణల నేపథ్యంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) హవాలా కుంభకోణంపై దర్యాప్తును ముమ్మరం చేసింది. మోసపూరిత లావాదేవీలకు పాల్పడినట్లు అనుమానిస్తున్న బ్యాంకు ఖాతాలపై దృష్టి సారించిన ఏజెన్సీ… నవంబర్ 14న దేశవ్యాప్తంగా 23 ప్రాంతాల్లో సోదాలు ప్రారంభించింది. ఈ కేసుతో ముడిపడి ఉన్న 2,200 అనుమానాస్పద లావాదేవీలపై కొనసాగుతున్న విచారణలో భాగంగా ఈ దాడులు జరిగాయి.
అహ్మదాబాద్‌లో 13, సూరత్‌లో మూడు, మహారాష్ట్రలోని మాలేగావ్, నాసిక్ లలో రెండు చోట్ల ఈడీ బృందాలు సోదాలు ప్రారంభించాయి. ముంబై లోని మరో ఐదు స్థావరాలు కూడా అధికారులు టార్గెట్ చేశారు. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, హర్యానా, గుజరాత్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్రతో సహా వివిధ రాష్ట్రాలకు సంబంధించిన హవాలా కార్యకలాపాలతో ఈ కేసు ముడిపడి ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు.
కాగా, కొద్దిరోజుల క్రితం మాలేగావ్ ప్రాంతానికి చెందిన 12 మంది యువకులను యజమానులుగా చూపిస్తూ నాసిక్ మర్చంట్ బ్యాంక్ మాలేగావ్ బ్రాంచ్ లో వివిధ సంస్థల పేర్ల మీద బినామీ బ్యాంక్ అకౌంట్లు క్రియేట్ అయ్యాయి. ఒక్కో ఖాతాలో రూ. 10 కోట్ల నుంచి రూ.15 కోట్ల వరకు మొత్తం రూ.125 కోట్లు జమయ్యాయి. ఈ విషయం సదరు యువకులకు తెలియడంతో పోలీసులను ఆశ్రయించారు.
అయితే కొన్ని రోజుల క్రితం ఉద్యోగాల పేరుతో సిరాజ్ అహ్మద్ అనే టీ, కూల్ డ్రింక్స్ వ్యాపారి తమ ఆధార్ కార్డు, పాన్ కార్డు, సంతకాలు తీసుకున్నాడని యువకులు పోలీసులకు తెలిపారు. దీంతో పోలీసులు సిరాజ్ ను అదుపులోకి తీసుకొని విచారణ ప్రారంభించారు. నకిలీ డాక్యుమెంట్లతో దాదాపు 200 బ్యాంకు ఖాతాలు తెరిచినట్లు అధికారుల విచారణలో వెల్లడైనట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ఎన్నికల సమయం కావడంతో అది హవాలా సొమ్మే అని, ప్రతిపక్షాలు ఓట్ జిహాద్ (Vote Zihad) కి తెరలేపారని బీజేపీ ఆరోపిస్తోంది.