CM Chandrababu| రాష్ట్ర విభజన నష్టం కంటే గత ఐదేళ్లలోనే రాష్ట్రానికి ఎక్కువ నష్టం జరిగిందని సీఎం చంద్రబాబు తెలిపారు. శాసనసభలో బడ్జెట్‌పై ఆయన మాట్లాడారు. గత ఐదేళ్లలో వ్యవస్థలను నాశనం చేశారని విమర్శించారు. తమ ప్రభుత్వం నాశనమైన అన్ని వ్యవస్థలను గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ఒక్క ఛాన్స్ అని వచ్చి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని మండిపడ్డారు. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు పారిపోయేందుకు సిద్ధంగా లేనని చెప్పారు. తన దగ్గర డబ్బులు లేకపోయినా.. నూతన ఆలోచనలు ఉన్నాయన్నారు. నూతన ఆలోచనలతో సంపద సృష్టించి పేదలకు పంచుతామన్నారు.
గత ఐదేళ్లలో వైసీపీ చేసిన తప్పులు, అప్పులు రాష్ట్రానికి శాపంగా మారాయన్నారు. స్కామ్‌ల కోసమే స్కీమ్‌లు అమలు చేశారని దుయ్యబట్టారు. అలాగే అమరావతిని గొప్ప నగరంగా తయారుకాకుండా ఐదేళ్లు అడ్డుకున్నారని.. రాష్ట్ర జీవనాడి పోలవరాన్ని దెబ్బతీశారని ఫైర్ అయ్యారు. పెట్టుబడులు పెట్టేందుకు వస్తే తరిమేశారని గుర్తుచేశారు. జగన్ మాత్రం రూ.431 కోట్లతో రుషికొండ ప్యాలెస్ నిర్మించారని తెలిపారు. రుషికొండ ప్యాలెస్‌ను చూస్తే తనకే కళ్లు తిరుగుతున్నాయని.. ప్రజాధనంతో ఇంత పెద్ద ప్యాలెస్ కడతారా? అని నిలదీశారు. రూ.700 కోట్లతో సర్వే రాళ్లపై బొమ్మలు వేశారని.. సాక్షికి రూ.400 కోట్ల ప్రకటనలు ఇచ్చారన్నారు. అదే రూ.500 కోట్లు ఖర్చు చేసి ఉంటే రోడ్లు బాగయ్యేవని పేర్కొన్నారు.
ఐదేళ్ల పాటు హింసా రాజకీయాలు, కక్షపూరిత కార్యక్రమాలు చేపట్టారని విమర్శలు చేశారు. కన్నతల్లి శీలాన్ని శంకించేలా పోస్టులు పెట్టించారని దుమ్మెత్తిపోశారు. ఆడబిడ్డలను కించపరిచేలా పోస్టులు పెడితే ఉపేక్షించమని హెచ్చరించారు. మహిళలను కించపరిచేలా కూటమి నేతలు, కార్యకర్తలు పోస్టులు పెట్టినా జైలులో పెట్టి కఠినంగా శిక్షిస్తామని వార్నింగ్ ఇచ్చారు.