బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో తెలంగాణలో అభివృద్ధి జరగలేదని.. కేవలం దోపిడీ మాత్రమే జరిగిందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. వరంగల్ జిల్లా హనుమకొండలో ప్రజా పాలన విజయోత్సవ సభ ఏర్పాట్లపై స్థానిక నేతలతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడు లేకుండా పోయారని.. కేసీఆర్ (KCR)కేవలం ఫామ్ హౌస్‌కే పరిమితమైరని విమర్శించారు. వచ్చే ఎన్నికల నాటికి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో ఉండదని జోస్యం చెప్పారు. బీఆర్ఎస్(BRS) పాలనలో రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు నెరవేర్చలేకపోయిందని విమర్శించారు. కల్వకుంట్ల కుటుంబం రాష్ట్రాన్ని అన్ని విధాలుగా దోచుకుందని ఆరోపించారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం కంటే మెరుగైన పాలనను తాము అందిస్తున్నామని పేర్కొన్నారు. సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లు పోస్టులు పెడుతున్నారని ఫైర్ అయ్యారు. అధికారం కోల్పోయామనే అసహనంతో కేటీఆర్(KTR) బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారని తెలిపారు. పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాల కన్నా ఏడాది వ్యవధిలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఉద్యోగాలే ఎక్కువని వెల్లడించారు. ఇక దేశంలోనే తొలిసారిగా కులగణన నిర్వహిస్తూ రోల్ మోడల్‌గా నిలిచామన్నారు. ఈనెల 19న వరంగల్‌లో నిర్వహించనున్న విజయోత్సవ సభకు ‘ఇందిరా మహిళా శక్తి సభ’గా నామకరణం చేశామని ఆయన చెప్పారు.