RGV| వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ(Ramgopal Varma)కు ఏపీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తనపై ప్రకాశం జిల్లాలోని మద్దిపాడు పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టేయాలంటూ చేసిన అభ్యర్థనను తోసిపుచ్చింది. అరెస్టుపై ఆందోళన ఉంటే బెయిల్ పిటిషన్ దాఖలు చేయాలని సూచించింది. అయితే విచారణకు మరికొంత సమయం ఇచ్చేలా పోలీసులను ఆదేశించాలని వర్మ తరపు న్యాయవాది విజ్ఞప్తి చేశారు. ఈ విజ్ఞప్తిని పోలీసుల ముందు చేసుకోవాలి..కోర్టు ముందు చేయకూడదని న్యాయమూర్తి తెలిపారు. దీంతో RGV పోలీసుల విచారణకు హాజరుకాక తప్పని పరిస్థితి ఏర్పడింది.
కాగా సార్వత్రిక ఎన్నికల ముందు ఆర్జీవీ రూపొందిచిన వ్యూహం సినిమా ప్రమోషనల్లో భాగంగా చంద్రబాబు, లోకేష్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైన సంగతి తెలిసిందే. దీంతో విచారణకు హాజరుకావాలంటూ ఆర్జీవీకి మద్దిపాడు పోలీసులు హైదరాబాద్‌లో నోటీసులు అందించారు.