భారత ప్రధాని నరేంద్ర మోదీ బ్రెజిల్ పర్యటనలో ఉన్నారు. G20 సదస్సు (G20 Summit) లో పాల్గొనేందుకు ఆయన ఇప్పటికే బ్రెజిల్ చేరుకున్నారు. ఈ మేరకు ప్రధాని మోదీ సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టారు. “బ్రెజిల్ రియో డి జనీరో జీ20 సదస్సులో పాల్గొనేందుకు బ్రెజిల్‌లోని రియో డి జనీరోలో ల్యాండ్ అయ్యాను. వివిధ ప్రపంచ నాయకులతో శిఖరాగ్ర చర్చలు, సంతృప్తికర చర్చల కోసం ఎదురుచూస్తున్నాను” అని మోదీ ట్వీట్ చేశారు.
కాగా, ఈరోజు, రేపు బ్రెజిల్ దేశంలో 19వ G20 సదస్సు (G20 Summit) జరగనుంది. ఈ పర్యటనలో పలు దేశాధినేతలతో ప్రధాని మోదీ భేటీ కానున్నారు. ఇదిలా ఉండగా, బ్రెజిల్ చేరుకున్న ప్రధాని మోదీకి ఘన స్వాగతం లభించింది. హోటల్ నేషనల్ దగ్గర బ్రెజిలియన్ పండితులు వేద పఠనం చేశారు. గుజరాతి వస్త్రధారణలో దాండియా నిర్వహించారు. ప్రవాస భారతీయులు భారత జెండా పట్టుకొని వందేమాతరం, మోదీ మోదీ అంటూ నినాదాలు చేశారు. ఇక G20 సదస్సులో భాగంగా ప్రధాని మోదీ వివిధ దేశాల నేతలతో భేటీ అవుతారు. సదస్సు ముగిసిన తర్వాత రేపు మోదీ గయానా వెళతారు. ఈ నెల 21 వరకు అక్కడే ఉండనున్నారు.