ఇప్పటి వరకు చెరువులను, కుంటల ను ఆక్రమించి చేసిన అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై హైడ్రా (HYDRAA) ఫోకస్ పెట్టింది. ఇపుడు చెరువులను ఎలా పరిరక్షించాలి? ఎలా అభివృద్ది చేయాలన్న విషయంపై దృష్టి సారించింది. లేక్ మ్యాన్ గా పేరుగాంచిన ఆనంద్ మల్లిగావడ్ తో కలిసి హైడ్రా కమిషనర్ రంగనాధ్ సోమవారం చందానగర్ డివిజన్ పరిధిలోని భక్షికుంట, రేగుల కుంట చెరువులను సందర్శించారు. తక్కువ ఖర్చుతో ఈ రెండు చెరువులను అభివృద్ధి చేసిన తీరును క్షేత్ర స్థాయిలో లేక్ మ్యాన్ వివరించారు. చెరువుల్లోకి మురుగు నీరు చేరకుండా మళ్లించిన తీరును హైడ్రా కమిషనర్ రంగనాధ్ క్షుణ్ణంగా పరిశీలించారు.
అపర్ణ హిల్ రాక్ గేటెడ్ కమ్యూనిటీ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఎస్టీపీ ద్వారా మురుగు నీటిని శుద్ధి చేసి చెరువులోకి మళ్లిస్తున్నట్లు రంగనాధ్ గుర్తించారు. దీప్తిశ్రీ నగర్ లోని రేగులకుంట చెరువులో నీటి స్వచ్ఛతను పరిశీలించి స్థానికులతో హైడ్రా (HYDRAA) కమిషనర్ ముచ్చటించారు. దీప్తి శ్రీ నగర్ లో ప్రజల అవసరాలకు కేటాయించిన స్థలాన్ని ప్రైవేటు పరం చేయాలని నిర్ణయించిన వారిపై హైడ్రా కమిషనర్ కు స్థానికుల ఫిర్యాదు చేశారు. దాదాపు 5 వేల గజాల స్థలం కబ్జా కాకుండా చూడాలని స్థానిక అధికారులను కమిషనర్ రంగనాథ్ ఆదేశించారు. రెగులకుంట, బక్షికుంట మాదిరే నగరంలో 10 చెరువులను మొదటి దశలో అభివృద్ది పనులు చేపడతామని కమిషనర్ తెలిపారు. చెరువుల తో పాటు వివిధ కాలనీల్లో పార్కుల కోసం ఇతర ప్రజావసరాల కోసం కేటాయించిన స్థలాలను హైడ్రా కాపాడుతుందని రంగనాథ్ స్థానికులతో వ్యాఖ్యానించారు.