ఒకప్పుడు వయస్సు పైబడినవారికి, అది కూడా ఎక్కువగా మగవారికి గుండెపోటు (Heart Attack ) సమస్య ఉండేది. కానీ, ఈ మధ్య కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా గుండెపోటుతో చనిపోతున్నవారి సంఖ్య పెరిగిపోయింది. ఇటీవల పదేళ్ల, పదమూడేళ్ల అబ్బాయిలు కూడా గుండెపోటుతో ప్రాణాలు విడిచిన విషయం తెలిసిందే. తాజాగా నాలుగేళ్ల చిన్నారి గుండెపోటు (Heart Attack) తో మరణించడం అందరినీ షాక్ కి గురి చేస్తోంది. అంత చిన్న వయసున్న పాపకి గుండెపోటు రావడమేంటో అని ఆశ్చర్యపోతున్నారు.
ఈ విషాదానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే… తెలంగాణలోని ఖమ్మం జిల్లా ఎంవీపాలెంలో నాలుగేళ్ల చిన్నారి గుండెపోటుకు గురై మృతి చెందింది. అప్పటివరకు సరదాగా ఆడుకున్న చిన్నారి ప్రహర్షిక (4) ఒక్కసారిగా కుప్పకూలింది. సోమవారం తల్లి లావణ్య గ్రూప్-3 ఎగ్జామ్స్ రాసి ఇంటికి రాగా ప్రహర్షిక తన దగ్గరకి పరిగెత్తుకుంటూ వెళ్లి కిందపడింది. ఏమైందని తల్లి లావణ్య అడగ్గా ఛాతిలో నొప్పివస్తోందని చెప్పి వెంటనే అపస్మారకస్థితిలోకి వెళ్లింది. దీంతో కుటుంబసభ్యులు తొలుత ఆర్ఎంపీ వద్దకు తీసుకెళ్లారు. ఆ తర్వాత ఖమ్మం ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే చనిపోయిందని వైద్యులు తెలిపారు. దీంతో చిన్నారి ప్రహర్షిక తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఎప్పుడూ చలాకీగా ఉండే తమ చిన్నారి కళ్ళముందే కుప్పకూలి ప్రాణాలు పోగొట్టుకుందని రోదిస్తున్నారు.