Pawan Kalyan| సీఎం చంద్రబాబు(CM Chandrababu) పాలనపై విశ్వాసం ఉందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. అసెంబ్లీ(AP Assembly session)లో ఆయన మాట్లాడుతూ.. సమర్థులైన నాయకుడు ఉంటే ఎలా ఉంటుందనేది చంద్రబాబును చూసి తెలుసుకోవచ్చని ప్రశంసించారు. విజయవాడ వరదల సమయంలో అధికార యంత్రాంగాన్ని దగ్గర ఉండి ఆయన నడిపిన తీరు అభినందనీయమని కొనియాడారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే బుడమేరుకు వరదలు వచ్చాయని విమర్శించారు.
ప్రతినెల ఒకటో తేదీన తమ ప్రభుత్వంలో వేతనాలు ఇస్తున్నామని.. కానీ వైసీపీ హయాంలో ఒకటో తేదీన వేతనాలు అందించలేదన్నారు. గత ప్రభుత్వం ప్రతి వ్యవస్థలో చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించిందని పేర్కొన్నారు. గత ప్రభుత్వం చేసిన తప్పులు, అప్పులు ఈ ప్రభుత్వానికి సవాల్‌గా మారాయన్నారు. తాము అధికారం ఉన్నా.. లేకున్నా ప్రజల కోసం పనిచేశామని వివరించారు. తెలుగు వారు ప్రపంచ వ్యాప్తంగా ఉండటానికి చంద్రబాబు ముఖ్య కారణమన్నారు.
ఇక రక్షిత మంచి నీరు.. ప్రతి ఒక్కరి హక్కు అని తెలిపారు. జలజీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి తాగు నీరందిస్తామని భరోసా ఇచ్చారు. జలజీవన్ మిషన్ అమలులో ఏపీ దేశానికే తలమానికంగా ఉండేలా తీర్చిదిద్దుతామని వెల్లడించారు. కలుషిత నీరు అనే మాట వినపడకుండా చేస్తామని.. కిడ్నీ సమస్యలు తగ్గిస్తామని చెప్పారు.