తెలంగాణలో ఉన్న శత్రు ఆస్తుల (Enemy Property) లెక్క తేల్చాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని హైదరాబాద్, రంగారెడ్డి, కొత్తగూడెం, వికారాబాద్ జిల్లాల్లో శత్రు ఆస్తుల వివరాల విచారణను వచ్చే నెలాఖరు నాటికి పూర్తి చేసి, జనవరి మొదటి వారంలో నివేదిక ఇవ్వాలని కోరారు.
గురువారం ఉదయం హైదరాబాద్ లోని హోటల్ మారియట్ లో శత్రు ఆస్తుల (Enemy Property) కి సంబంధించి బండి సంజయ్ (Bandi Sanjay) సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో సెపీ ముంబై విభాగ అధికారులతోపాటు రెవిన్యూ ముఖ్య కార్యదర్శి, సీసీఎల్ఏ నవీన్ మిట్టల్, హోంశాఖ సహాయ మంత్రి వ్యక్తిగత కార్యదర్శి అండ్ర వంశీ, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి, హైదరాబాద్, సికింద్రాబాద్, వికారాబాద్ రెవిన్యూ డివిజనల్ అధికారులు హాజరయ్యారు.
Also Read : అదానీపై కేసు… ప్రధానిపై ఎమ్మెల్సీ కవిత ఫైర్
Bandi Sanjay | సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశాలు
కేంద్ర మంత్రి మాట్లాడుతూ తక్షణమే ఆయా ఆస్తుల రికార్డుల పరిశీలన, సర్వే నిర్వహణకు సెపీ ఆధ్వర్యంలో ప్రత్యేక టీం ను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున రికార్డుల పరిశీలన, సర్వే నిర్వహణ కోసం ప్రత్యేకంగా బృందాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. వీరిద్దరి ఆద్వర్యంలో జాయింట్ కమిటీగా ఏర్పాటై డిసెంబర్ నెలాఖరులో కల్లా రికార్డుల పరిశీలనతోపాటు సర్వే పూర్తి చేయాలని ఆదేశించారు. జనవరి తొలివారానికల్లా తెలంగాణలోని ఎనిమీ ఆస్తుల వివరాలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని కోరారు. ఆ నివేదిక ఆధారంగా శత్రు ఆస్తులపై తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
శత్రు ఆస్తులు (Enemy Property) అంటే…?
1962లో చైనీస్ దండయాత్ర, 1965 నుండి 1971 వరకు నిర్వహించిన ఇండో-పాక్ యుద్దం అనంతరం భారత్ నుండి వెళ్లిపోయి పాకిస్తాన్, చైనాలో స్థిరపడి ఆయా దేశాల పౌరసత్వం తీసుకున్న వ్యక్తులకు సంబంధించి భారత్ లో ఉన్న ఆస్తులను శత్రు ఆస్తులు (Enemy Property) గా ప్రభుత్వం గుర్తించింది. వీటి సంరక్షణ బాధ్యతలను కస్టోడియన్ ప్రాపర్టీ ఆఫ్ ఇండియా (CEPI)కు అప్పగించింది. తెలంగాణ, ఏపీతోపాటు దేశవ్యాప్తంగా 21 రాష్ట్రాల్లో, 2 కేంద్ర పాలిత ప్రాంతాల్లో దాదాపు 13 వేల వరకు శత్రు ఆస్తులున్నట్లు కేంద్రం వద్ద రికార్డులున్నాయి. వీటి మార్కెట్ విలువ వేల కోట్లు ఉన్నట్లు గుర్తించింది. ఎనిమీ ప్రాపర్టీ చట్టంలోని సెక్షన్ 8(ఏ) ప్రకారం ఈ ఆస్తులను విక్రియంచే అధికారం కేంద్రానికి ఉంది. అయితే నాటి నుండి నేటి వరకు ఈ ఆస్తులు చాలా చోట్ల అన్యాక్రాంతమయ్యాయి. మరికొన్ని ఆస్తులకు సంబంధించి న్యాయ వివాదాలు నడుస్తున్నాయి.