Saturday, November 23, 2024
Homeతెలంగాణమహా, జార్ఖండ్ ఫలితాలు... రేవంత్ కి KTR చురకలు

మహా, జార్ఖండ్ ఫలితాలు… రేవంత్ కి KTR చురకలు

మహరాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల ఫలితాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) స్పందించారు. మహారాష్ట్రలో కాంగ్రెస్ ని, జార్ఖండ్ లో బీజేపీని జనం తిరస్కరించటంపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ భవిష్యత్తుకు ప్రాంతీయ పార్టీలే గట్టి పునాదులన్న సందేశం ఇచ్చే విధంగా రెండు రాష్ట్రాల ప్రజలు తమ తీర్పు ఇచ్చారని అన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, బీజేపీలపై కేటీఆర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీకి బలమైన ప్రతిపక్షంగా కూడా నిలవలేని దయనీయ పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉందని ఎద్దేవా చేశారు. కేవలం కాంగ్రెస్ చేతగానీ, అసమర్థ విధానాల కారణంగానే బీజేపీ మనుగడ కొనసాగుతుందని అన్నారు.

- Advertisement -

ప్రాంతీయ పార్టీలు బలంగా లేని చోట మాత్రమే బీజేపీ గెలుస్తుందని కేటీఆర్ (KTR) అభిప్రాయం వ్యక్తం చేశారు. తమ చేతగాని తనాన్ని, అసమర్థతను గుర్తించాల్సింది పోయి ఇప్పటికీ సిగ్గు లేకుండా ప్రాంతీయ పార్టీలను ఎలా అంతం చేయాలన్న కుట్రపై కాంగ్రెస్ పార్టీ ఫోకస్ పెట్టిందని నిప్పులు చెరిగారు. ప్రాంతీయ పార్టీలను లేకుండా చేయాలన్న కుట్రలో కాంగ్రెస్ ఎక్కువ కాదు, బీజేపీ తక్కువ కాదన్నారు. ఈ రెండు పార్టీలు కలిసి దేశంలో ప్రాంతీయ పార్టీలు ఉండొద్దన్నట్లుగా కుట్రలు చేస్తున్నాయని ధ్వజమెత్తారు.

రేవంత్ రెడ్డికి కేటీఆర్ చురకలు…

మహారాష్ట్రలో కాంగ్రెస్ ఘోర ఓటమి నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ చురకలు అంటించారు. తెలంగాణలో ఏదో పొడిచేశామని మీరు చేసిన అబద్దపు ప్రచారాలను మరాఠా ప్రజలు నమ్మలేదని అన్నారు. మీ ప్రచారాలు, ప్రసంగాలు, బ్యాగులు, ఛాపర్లు అన్ని కూడా మీ పార్టీని ఘోర ఓటమి నుంచి కాపాడలేకపోయాయని సెటైర్లు వేశారు. ఇకనైనా సీఎం పదవికి న్యాయం చేయాలని సూచించారు. ముఖ్యమంత్రిగా తన ప్రాథమిక కర్తవ్యంపై దృష్టి సారించి ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు. ఏడాది క్రితం ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేసే పని మీద దృష్టి పెట్టాలని రేవంత్ రెడ్డి కి కేటీఆర్ హితవు పలికారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News