బీసీలకు న్యాయం జరగాలంటే రాజ్యాంగ సవరణ జరగాలి అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (BRS MLC Kavitha) అన్నారు. సోమవారం ఆమె బీసీ సంఘాలు, యునైటెడ్ ఫులే ఫ్రంట్, తెలంగాణ జాగృతి నాయకులతో కలిసి హైదరాబాద్ లో డేడికేటెడ్ బీసీ కమిషన్ చైర్మన్ బుసాని వెంకటేశ్వరరావును కలిశారు. 35 పేజీలతో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో చేపట్టిన బీసీల సమగ్ర అధ్యయన నివేదికను ఆయనకి అందజేశారు. స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు పెంచాలని డిమాండ్ చేస్తూ వినతిపత్రాన్ని సమర్పించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత (BRS MLC Kavitha) మాట్లాడుతూ… తెలంగాణ జాగృతి రెండు దశాబ్దాల నుంచి ప్రజల కోసం పోరాడుతుందన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న బీసీలకు న్యాయం చేసే విధంగా మా భవిష్యత్తు పోరాటం ఉంటుందని తెలిపారు. బీసీ మేధావులు అందరితో చర్చలు జరుపుతున్నామన్నారు. బీసీలకు న్యాయం జరగాలంటే రాజ్యాంగ సవరణ జరగాలని అభిప్రాయపడ్డారు. కేంద్ర ప్రభుత్వానికి బీసీ చైర్మన్ గా మీరు కూడా రిఫర్ చేయాలని కోరుతున్నామంటూ కమిషన్ చైర్మన్ కి విజ్ఞప్తి చేశారు.
Also Read : GHMC హౌసింగ్ సొసైటీలకు షాకిచ్చిన సుప్రీం
విద్యా ఉద్యోగాలలో బీసీలకు 27% రిజర్వేషన్ ఉన్నప్పటికీ.. 7-8 శాతానికి మించి అందడం లేదన్నారు. ఐఐటి, ఐఐఎంలలో ఎంతో పోరాటం చేసినా కూడా ఓబీసీ కోటా పూర్తి కావడం లేదన్నారు. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని ప్రకటించిందన్నారు. ఇన్యూమరేషన్ ప్రకారం బీసీలకు రిజర్వేషన్లు పెంచుతారా అనే అనుమానాలు మాకు ఉన్నాయని కవిత వెల్లడించారు. తెలంగాణలో జరుగుతున్న కులగణన శాస్త్రీయంగా, సమగ్రంగా జరగాలని డిమాండ్ చేశారు. స్థానిక సంస్థలలో బీసీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వాలని కవిత కోరారు. చట్టసభల్లో రిజర్వేషన్లు అమలు చేయాలన్నారు. మహిళలకు కూడా 50% ఉన్న రిజర్వేషన్లు తగ్గించకుండా ఉండాలని కవిత డిమాండ్ చేశారు.