నేను కేసులకు భయపడను అంటున్నారు వివాదాల డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. పరారీలో ఉన్నాడంటూ తనపై జరుగుతున్న ప్రచారంపై ఆర్జీవీ (RGV) స్పందించారు. తాను ఎక్కడికీ పారిపోలేదని, కొంతమంది ఇష్టం వచ్చినట్టు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్నవారికి క్లారిటీ ఇచ్చేందుకు వీడియో విడుదల చేస్తున్నట్టు తెలిపారు.
పోలీసులు అరెస్టు చేస్తారన్న భయంతో ఆర్జీవీ (RGV) పారిపోయాడంటూ బాగా మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారానికి బ్రేక్స్ వేస్తూ బుధవారం రామ్ గోపాల్ వర్మ తన యూట్యూబ్ చానల్ వేదికగా ఓ వీడియో విడుదల చేశారు. తన స్టైల్లోనే కేసుపైన, హాజరుకాకపోవడంపైనా క్లారిటీ ఇచ్చారు.
“నేను కేసులకు భయపట్లేదు. సంవత్సరం కింద నేను వేసిన ట్వీట్లకు మనోభావాలు దెబ్బ తిన్నాయని కేసులు పెడుతున్నారు.. ఒకే రోజు నాలుగు వేరు, వేరు ప్రాంతాల్లో నలుగురికి మనోభావాలు దెబ్బ తిన్నాయా? నేను ఎవరిపై ట్వీట్లు వేసానో వారి మనోభావాలు దెబ్బ తినకుండా, వేరే ఎవరికో మనోభావాలు ఎలా దెబ్బతింటాయి? దీనికి కేసులు ఎలా వర్తిస్తాయి? నేను ప్రస్తుతం ఓ సినిమా షూటింగ్లో ఉన్నాను. నిర్మాతకు నష్టం కలుగుతుందన్న కారణంగానే పోలీసు విచారణకు హాజరు కాలేకపోతున్నాను” అని ఆ వీడియోలో వివరించారు.