భారత రాజ్యాంగ నిర్మాత, భారత రత్న డా. బిఆర్ అంబేద్కర్ 68 వ వర్దంతి సందర్భంగా పికెట్ లోని ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు ఎమ్మెల్యే శ్రీగణేష్.
భారత ప్రజాస్వామ్య సౌధానికి రాజ్యాంగంతో ప్రాణం పోసిన మహనీయుడు అంబేద్కర్ అన్నారు ఎమ్మెల్యే. మూడేళ్ల పాటు 60 దేశాల రాజ్యాంగాలను ఔపోసన పట్టిన తరువాత మన రాజ్యాంగాన్ని రూపొందించారని అన్నారు. సామాజిక సమానత్వం, ఆర్థిక సమానత్వం లేకుండా రాజకీయ స్వేచ్ఛ అసంపూర్ణమని అంబేద్కర్ నమ్మారని, అందుకే అంటరానితనం, కుల వివిక్ష మీద ఆయన జీవితమంతా పోరాడారని అన్నారు శ్రీగణేష్.
ఆయన రాసిన రాజ్యాంగ ఫలితంగానే ఇప్పుడు సమాజంలో దళితులకు సమాన హక్కులు లభిస్తున్నాయని, ఆయన దళిత, బహుజనుల కోసం జీవితాతం పోరాడారని గుర్తుచేసుకున్నారు. ఆయన ఆశయాలను గుర్తు చేసుకుంటూ అందుకు అనుగుణంగా, ఆయన పోరాటమే స్పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్తుందని అన్నారు ఎమ్మెల్యే. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.