Nayanthara| స్టార్ హీరోయిన్ నయనతారకు కోర్టు నోటీసులు అందించింది. ఆమె సినీ జీవిత చరిత్ర ఆధారంగా నెట్‌ఫ్లిక్స్ తీసిన ‘నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్’ (Nayanthara beyond the fairy tale) దాక్యుమెంటరీపై వివాదం తలెత్తిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా స్టార్ హీరో ధనుష్ (Dhanush) ఇటీవల మద్రాస్ హైకోర్టులో నయనతార- విఘ్నేశ్ శివన్ దంపతులపై దావా వేశారు. దీనిపై తాజాగా విచారణ జరిపిన న్యాయస్థానం వారితో పాటు నెట్‌ఫ్లిక్స్ బృందానికి నోటీసులు జారీ చేసింది. జనవరి 8వ తేదీ లోపు ఈ వ్యవహారంపై సమాధానం ఇవ్వాలని ఆదేశించింది.
కాగా ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ రూపొందించిన నయనతార డాక్యుమెంటరీలో ‘నానుమ్ రౌడీ దాన్’ పాటలు వినియోగించుకోవడానికి అవకాశం ఇవ్వకపోవడంపై ధనుష్‌కు నయనతార బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖలో ఆయనతో తీవ్ర విమర్శలు చేశారు నయన్. మూడు సెకన్ల క్లిప్స్ వాడుకున్నందుకు దాదాపు రూ.10 కోట్లు డిమాండ్ చేయడం విచారకరమని మండిపడ్డారు. మరోవైపు నయన్ భర్త, దర్శకుడు విఘ్నేశ్ కూడా ధనుష్ తీరుపై మండిపడ్డారు. ధనుష్ మంచివాడు కాదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలోనే ధనుష్ నయనతార దంపతులపై హైకోర్టును ఆశ్రయించారు.