తిరుమలలో కళ్ళకు కనువిందు చేసే ప్రకృతి రమణీయత సొంతం. ఇక మంచు కురిసే సమయాల్లో ఎత్తైన ఏడు కొండల, చుట్టుపక్కల ప్రాంతాలు, శ్రీవారి ఆలయం పై కమ్మేసిన పొగమంచు చూసేందుకు రెండు కళ్ళు చాలవు.
శీతాకాలంలో ఆ సూర్యుడు ఎప్పుడు ఉదయిస్తాడా…. దట్టమైన మంచు దుప్పటిని మెల్లగా వెళ్ళగొడతాడా అనే విధంగా చలి తీవ్రత తిరుమలలో కొనసాగుతుంది. భారీ వర్షాల కారణంగా అటవీ ప్రాంతంలోని జలపాతాలు, ఎత్తైన కొండపై నుంచి ఆకాశగంగా జాలువారే దృశ్యాలు కనువిందు చేస్తాయి. తిరుమలలో గత రెండు రోజులుగా చలి తీవ్రత అధికంగా ఉంది.
రెండు రోజులుగా తిరుమల ఘాట్ రోడ్డుతో పాటుగా, తిరుమల గిరులు మొత్తం అప్పుడప్పుడు మంచుతో కప్పుకున్నాయి. వైకుంఠాన్ని తలపించేలా మంచు పొగ తిరుమలను వ్యాపించి ఉండటంను చూసి యాత్రికులు ఆనందిస్తున్నారు. మంచుతో మేఘాలు స్వయంగా భువిపై దిగి వచ్చినట్లు కనిపించే సరికొత్త వాతావరణం శ్రీనివాసుడి భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.