LK Advani: బీజేపీ కురువృద్ధుడు, మాజీ ఉప ప్రధాని ఎల్‌కే అద్వానీ తీవ్ర అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే.. దీంతో ఆయన్ను హుటాహుటిని ఢిల్లీలోని అపోలో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దీంతో ఆయన ఆరోగ్య పరిస్థితిపై బీజేపీ శ్రేణులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో వైద్యులు ఆయన హెల్త్ బులిటిన్ విడుదల చేశారు. ప్రస్తుతం ఆయనకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. డాక్టర్ వినీత్ సూరి పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారని.. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వెల్లడించారు.
కాగా గత కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో ఆయన బాధపడుతున్నారు. ఇప్పటికే పలుమార్లు అస్వస్థతకు గురయ్యారు. అఖండ భారత్‌లోని కరాచీలో జన్మించిన అద్వానీ సుదీర్ఘకాలం పాటు బీజేపీలో అగ్రనాయకుడిగా కొనసాగుతున్నారు. అయోధ్య రామమందిర నిర్మాణం పోరాటంలో కీలకపాత్ర పోషించారు. 2002 నుంచి 2004 వరకు అటల్ బిహారీ వాజ్‌పేయి నేతృత్వంలోని ప్రభుత్వంలో ఉప ప్రధానిగా ఉన్నారు. అద్వానీ తన రాజకీయ జీవితాన్ని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) వాలంటీర్‌గా ప్రారంభించారు. 2015లో అద్వానీకి భారతదేశపు రెండవ అత్యున్నత పౌర పురస్కారమైన ‘పద్మవిభూషణ్’ లభించింది. 2024లో ఆయనకు భారతరత్న పురస్కారం లభించింది.