Chandrababu: పోలవరం ప్రాజెక్టు(Polavaram Project) ఏపీకి జీవనాడి అని సీఎం చంద్రబాబు తెలిపారు. 2026 అక్టోబర్ నాటికి ప్రాజెక్టును పూర్తి చేయాలనే లక్ష్యం పెట్టుకున్నట్లు చెప్పారు. నీటిపారుద శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు(Nimmala Ramanaidu), అధికారులతో కలిసి ఆయన ప్రాజెక్టు నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన ఫొటో గ్యాలరీని సందర్శించారు. అనంతరం ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. 2025 డిసెంబర్ నాటికి డయాఫ్రం వాల్ పూర్తి కావాలని అధికారులను ఆదేశించారు.
ఈ ప్రాజెక్టు వల్ల 7.20 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు అందుబాటులోకి వస్తుందన్నారు. 28 లక్షల మందికి తాగునీరు, 960 మెగావాట్ల విద్యుదుత్పత్తి సాధ్యపడుతుందని పేర్కొన్నారు. విశాఖ పారిశ్రామిక అవసరాలు, తాగునీటికి 23 టీఎంసీలు అందుబాటులోకి వస్తాయని వెల్లడించారు. పోలవరం పూర్తి చేసి నదుల అనుసంధానం చేస్తే రాష్ట్రానికి గేమ్ ఛేంజర్ అవుతుందన్నారు. 2014 నుంచి 2019 వరకు ప్రాజెక్టు పూర్తి కోసం రేయింబవళ్లు పని చేశామని గుర్తు చేశార. కానీ 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక రివర్స్ టెండరింగ్ పేరుతో ప్రాజెక్టును సర్వనాశనం చేశారని చంద్రబాబు మండిపడ్డారు.