అదానీ- ప్రధాని మోదీ దేశం పరువు తీశారని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) విమర్శించారు. అదానీ ముడుపులు, మణిఫుర్ అల్లర్లపై ఏఐసీసీ పిలుపు మేరకు టీపీసీసీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఛలో రాజ్ భవన్ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. అనంతరం రాజ్ భవన్ ఎదుట భైఠాయించి కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. అదానీ అంశంపై జాయింట్ పార్లమెంట్ కమిటీ వేయాలని డిమాండ్ చేశారు. లేదంటే రాష్ట్రపతి భవన్ వద్ద ధర్నా చేస్తామని హెచ్చరించారు. జేపీసీ వేస్తే అదానీ జైలుకు వెళ్లాల్సి వస్తుందని తెలిపారు. అమెరికా ప్రభుత్వం చట్ట ప్రకారం అదానీపై చర్యలకు పూనుకుందన్నారు. మోదీ అదానీని వదిలిపెట్టినా అమెరికా ప్రభుత్వం మాత్రం వదిలిపెట్టదని పేర్కొన్నారు. ఇక కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్, కవిత ప్రజల వైపు ఉన్నారా..? అదానీ వైపు ఉన్నారా..? అని నిలదీశారు. బీఆర్ఎస్ నేతలు రెడీ అంటే అసెంబ్లీలో తీర్మానం చేద్దామన్నారు.
కాగా అంతకుముందు నెక్లెస్ రోడ్డులోని ఇందిరా గాంధీ విగ్రహం నుంచి సోమాజిగూడలోని రాజ్ భవన్ వరకు పాదయాత్రగా ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ దీపాదాస్ మున్షీ, టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.