‘డోలీ రహిత ఆంధ్రప్రదేశ్’ లక్ష్యంగా పనిచేస్తున్నామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan Kalyan) తెలిపారు. ఇక్కడ ప్రజల ఆవేదన, బాధ తెలుసుకోవడం కోసమే అటవీ ప్రాంతంలో పర్యటించామన్నారు. అల్లూరి జిల్లా అనంతగిరి మండలం గుమ్మంతి పర్యటనలో భాగంగా గిరిజనుల సమస్యను ఆయన అడిగి తెలుసుకున్నారు. ‘డోలీ మోతల విముక్త ఏపీ’లో భాగంగా మారుమూల గిరిజన గ్రామాలకు రహదారి నిర్మాణం కోసం భూమి పూజ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వంలో పవన్ కల్యాణ్ భాగస్వామి అయ్యాడంటే.. ప్రతీ గిరిజన యువకుడు ప్రభుత్వంలో ఉన్నట్లే అన్నారు.
రూ.105 కోట్లతో పంచాయతీ రాజ్ శాఖ ద్వారా రోడ్లు నిర్మిస్తున్నామని చెప్పారు. ఎన్నికల కోసమో, ఓట్ల కోసం తమ ప్రభుత్వం పనిచేయదన్నారు. గిరిజన యువత తలుచుకుంటేనే మార్పు సాధ్యమన్నారు. గంజాయిని ఒక సామాజిక సమస్యగా చూడాలని పవన్ సూచించారు. యువత, పిల్లలు చెడిపోవడానానికి గంజాయి కారణమంటూ వ్యాఖ్యానించారు. గంజాయి సాగు వదిలేయమని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు.
గంజాయి గ్రామాలను దాటి ఎక్స్‌పోర్ట్ వరకు వెళ్లడంతో ఏపీ గంజాయి కేపిటల్‌గా మారిందని వాపోయారు. గంజాయిని మీరు వదిలే వరకు మిమ్మల్ని తాను వదలనని స్పష్టం చేశారు. సినిమా పరిశ్రమ ఇక్కడికి రావాలని.. విదేశాలలో ఉండే చాలా సుందరమైన ప్రదేశాలు ఇక్కడ ఉన్నాయన్నారు. ఇటువంటి చోట షూటింగ్‌లు చేస్తే స్థానిక గిరిజనులకు ఉపాధి లభిస్తుందని పవన్ వెల్లడించారు.