తెలుగు చిత్ర పరిశ్రమ ఏపీకి వస్తే స్వాగతిస్తామని టీడీపీ ఏపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు(Palla Srinivasa Rao) తెలిపారు. సినీ ఇండస్ట్రీ ఏపీకి వస్తే బాగుంటుందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan Kalyan) చెప్పిన మాటలను స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎన్నో అందమైన షూటింగ్ స్పాట్స్ ఉన్నాయన్నారు. హైదరాబాద్ రద్దీగా మారిందని అందుకే ఏపీకి రావాలని సూచించారు. ఇక్కడ కూడా ఎంతో మంది కళాకారులు ఉన్నారని.. వారందరికీ ఉపాధి లభిస్తుందన్నారు.
ఇక సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై శ్రీనివాస్ మాట్లాడుతూ..”తొక్కిసలాటలో ఇంటెలిజెన్స్ వైఫల్యం కనిపిస్తోంది. ఇంటెలిజెన్స్ విభాగం పరిస్థితిని ముందే అంచనా వేయాలి. ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా చూడాలి. సినిమా స్టార్స్ సైతం పరిస్థితిని అంచనా వేయగలగాలి. ఆ సమయంలో అల్లు అర్జున్(Allu Arjun) అక్కడికి వెళ్లాల్సింది కాదు. ప్రజల ప్రాణాలకు హానీ కల్గకుండా చూడాలి. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలి” అని తెలిపారు.
కాగా అల్లూరి జిల్లాలో పర్యటించిన పవన్ కళ్యాణ్ సినిమా పరిశ్రమ ఏపీకి రావాలని పిలుపునిచ్చారు. విదేశాలలో ఉండే చాలా సుందరమైన ప్రదేశాలు ఇక్కడ ఉన్నాయన్నారు. ఇటువంటి చోట షూటింగ్‌లు చేస్తే స్థానిక గిరిజనులకు ఉపాధి లభిస్తుందని వెల్లడించారు.