సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్(CV Anand) ఓ వీడియోను విడుదల చేశారు. ఈ ఘటనపై చిక్కడపల్లి ఏసీపీ రమేశ్, సీఐ రాజు నాయక్ వివరణ ఇచ్చారు. ఆరోజు ఏం జరిగిందో వివరించారు.
ఏసీపీ రమేశ్ మాట్లాడుతూ.. ‘‘అల్లు అర్జున్(Allu Arjun) మేనేజర్ సంతోష్‌ని కలిసి తొక్కిసలాటలో మహిళ చనిపోయారు, బాలుడు తీవ్రంగా గాయపడ్డారు. పరిస్థితి అదుపుతప్పింది. ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని సూచించాం. అయినా మేనేజర్ మమ్మల్ని అల్లు అర్జున్ వద్దకు వెళ్లనీయలేదు. అతి కష్టం మీద వారిని నెట్టుకుంటూ వెళ్లి జరిగిన విషయం అల్లు అర్జున్‌కు చెప్పా. మీకు అధికారులంతా సహకరించి రూట్ క్లియర్ చేశారు. దయ చేసి ఇక్కడి నుంచి ఖాళీ చేయండి అని చెప్పా. సినిమా చూసిన తర్వాతే వెళ్తానని బన్నీ చెప్పారు. వెంటనే డీసీపీకి చెప్పాం. ఆయన, మేము లోపలికి వెళ్లి 10 నిమిషాలు సమయం ఇచ్చాం. ఆ తర్వాత అల్లు అర్జున్‌ను బయటకు తీసుకొచ్చాం. మేం లోపలికి వెళ్లే వీడియోలు ఉన్నాయి. అల్లు అర్జున్‌తో మాట్లాడే ఫుటేజ్ కోసం ట్రై చేశాం దొరకలేదు’’ అని పేర్కొన్నారు.
ఇక సీఐ రాజు నాయక్ మాట్లాడుతూ.. రేవతిని, బాబు తేజను కాపాడేందుకు ఎంతో ప్రయత్నించానన్నారు. ఎస్సై మౌనిక, తాను రేవతికి సీపీఆర్ చేశామని.. కానీ తమ ముందే రేవతి ప్రాణాలు పోయాయని తెలిపారు. ఆ తొక్కిసలాటలో తన ప్రాణాలు కూడా పోయేవని సీఐ వాపోయారు.
కాగా ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని, న్యాయపరమైన సలహాలు తీసుకుని ముందుకెళ్తామని సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. ఈ సందర్భంగా ఆరోజు అల్లు అర్జున్‌ను పోలీసులు థియేటర్ బయటకు తీసుకొస్తున్న వీడియోను బయటపెట్టారు.