సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆమె కుమారడు శ్రీతేజ్ చావుబతుకుల మధ్య కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ నేపథ్యంలో రేవతి కుటుంబానికి ‘పుష్ప2’ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) ఆర్థికసాయం అందించింది. మైత్రీ మూవీస్ సంస్థ నిర్మాతలు నవీన్ యెర్నేని, యలమంచిలి రవిశంకర్‌లు రూ.50లక్షల చెక్కును మృతురాలి భర్తకు అందించారు.
అనంతరం తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తొక్కిసలాట ఘటనలో రేవతి చనిపోవడం చాలా బాధాకరమని వారి కుటుంబానికి తీరనిలోటు అని తెలిపారు. ప్రస్తుతం బాబు శ్రీతేజ్ కోలుకుంటున్నాడని చెప్పారు. బాధిత కుటుంబానికి తమ వంతు సాయం చేయడానికి వచ్చామని.. ఆ కుటుంబానికి ఎప్పటికీ అండగా నిలబడతామని హామీ ఇచ్చారు.