ఫార్ములా ఈ కార్ రేస్(Formula E-Race) కేసులో ఏసీబీ అధికారులు దూకుడు పెంచారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) నివాసంలో సోదాలు(ACB Raids) నిర్వహించారు. గచ్చిబౌలిలోని ఓరియన్ విల్లాస్‌లో ఉన్న కేటీఆర్ నివాసంలో తనిఖీలు జరిపారు. ఈ నేపథ్యంలో ఈనెల 9వ తేదీన విచారణకు హాజరుకావాలని నోటీసలు జారీ చేశారు. ఏకంగా కేటీఆర్ నివాసంలో అధికారులు సోదాలు నిర్వహించడం తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కాగా ఏసీబీ విచారణకు వచ్చిన సమయంలో తన ఇంట్లో ఏసీబీ సోదాలు జరుగుతాయని కేటీఆర్ చెప్పిన సంగతి తెలిసిందే.
మరోవైపు ఈ కేసులో విచారణకు రావాలని నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో కేటీఆర్ ఏసీబీ కార్యాలయానికి వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే తన న్యాయవాదులను లోపలికి అనుమతిస్తేనే విచారణకు సహకరిస్తారని తేల్చి చెప్పారు. కానీ పోలీసులు అనుమతించకపోవడంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ క్రమంలో ఏసీబీ నోటీసులపై వివరణ ఇస్తూ లేఖ రాశారు. హైకోర్టు తీర్పు వచ్చేంతవరకు విచారణ ఆపాలని కోరారు. ఈ పరిణామాల నేపథ్యంలో కేటీఆర్‌ను మరోసారి విచారణకు పిలవాలని ఏసీబీ అధికారులు నిర్ణయించారు. తాజాగా ఏసీబీ అధికారులు కేటీఆర్ నివాసంలో సోదాలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.