సీనియర్ రాజకీయ నేత మర్రి శశిధర్ రెడ్డి నేడు బీజేపీలో చేరనున్నారు. ఇటీవల ఆయన రాష్ట్ర బీజేపీ నేతలతో కలిసి ఢిల్లీకి వెళ్లి కేంద్ర బీజేపీ నేతలతో భేటీ అయిన విషయం తెలిసిందే. అప్పటి నుండి మర్రి పార్టీ మారుతున్నారన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఈ క్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ కూడా ఆయన పార్టీ నియమాలను ఉల్లంఘించారని పేర్కొంటూ ఆరేళ్లు పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. అంతకు ముందే మర్రి శశిధర్ తన ట్విట్టర్ హ్యాండిల్ నుండి కాంగ్రెస్ పేరును తొలగించి.. పార్టీని వీడుతున్నట్లు సంకేతాలిచ్చారు.
అనంతరం పార్టీకి రాజీనామా చేసి.. అందుకు గల కారణాలను తెలుపుతూ సోనియా గాంధీకి లేఖ రాశారు. నేడు మర్రిశశిధర్ రెడ్డి జేపీ నడ్డా ఆధ్వర్యంలో ఢిల్లీలో కమల తీర్థం పుచ్చుకోనున్నారు. రాష్ట్ర కాంగ్రెస్ లో జరుగుతున్న పరిణామాలే తనను పార్టీ వీడేలా చేశాయని మర్రి చెబుతున్నారు. ఆ అసంతృప్తి కారణంగానే బీజేపీ చేరుతున్నానన్నారు. తానేమీ రాజకీయాల నుండి రిటైర్ కాలేదని స్పష్టం చేశారు.