ఏపీ ప్రజలను ప్రధాని మోదీ(PM Modi) దారుణంగా వెన్నుపోటు పొడిచారని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల(YS Sharmila) విమర్శించారు. విశాఖపట్నంలో జై బాపూజీ, జై భీమ్, జై సంవిధాన్ పోస్టర్‌ను రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ శ్రీ మాణిక్యం ఠాగూర్‌తో కలిసి ఆవిష్కరించారు. పార్లమెంట్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి హేళనగా మాట్లాడారని విమర్శించారు. రాజ్యాంగం రాసిన అంబేద్కర్‌ను అవమానించిన అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ బీజేపీ రాష్ట్రానికి తీరని అన్యాయం చేసిందని మండిపడ్డారు.
మోదీ విశాఖ వచ్చినప్పుడు కనీసం విభజన హామీలపై ఒక్క మాట కూడా మాట్లాడలేదని ఫైర్ అయ్యారు. ప్రత్యేక హోదా, విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ, ఉత్తరాంధ్ర-రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ , కడప స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడలేదన్నారు. అలాంటి పార్టీతో టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకున్నాయని విమర్శించారు. ఏపీ ప్రజలను దారణంగా మోసం చేసిన మోడీతో చంద్రబాబుది సక్రమ సంబంధం అయితే… జగన్‌ది అక్రమ సంబంధం అని ఆరోపించారు. దళితుల ఓట్లుతో గెలిచిన జగన్.. రాజశేఖర్ రెడ్డి ఆశయాలను గంగలో కలుపుతున్నారన్నారు. ఆయన వారసులమని చెప్పుకునే జగన్ బీజేపీతో ఎందుకు కొమ్ముకొస్తున్నారని ప్రశ్నించారు. రాజశేఖర్ రెడ్డి వారసుల్లో బీజేపీని వ్యతిరేకిస్తుంది తాను మాత్రమే అని చెప్పారు. ఈ రాష్ట్రంలో బీజేపీ వ్యతిరేక విధానాలపై పోరాటం చేసేది కాంగ్రెస్ పార్టీ మాత్రమే అని షర్మిల స్పష్టం చేశారు.