విక్టరీ వెంకటేష్ (Venkatesh) హీరోగా, ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కిన ‘సంక్రాంతికి వస్తున్నాం’(Sankranthiki Vasthunnam) బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ దక్కించుకుంది. ఫ్యామిలీ ఆడియన్స్‌కు ఈ సినిమా విపరీతంగా నచ్చింది. దీంతో మూవీకి వసూళ్ల వర్షం కురుస్తోంది. రెండు రోజుల్లో ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ.77 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా చిత్ర బృందం ఓ పోస్టర్ ద్వారా తెలియజేసింది. కాగా ఈ చిత్రం తొలి రోజు రూ.45 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి వెంకటేష్ కెరీర్‌లోనే తొలి రోజు అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా ఈ మూవీ నిలిచింది. ప్రస్తుతం ఈ చిత్రానికి వస్తున్న ఆదరణ చూస్తుంటే మరో రెండు రోజుల్లో రూ.100 కోట్ల క్లబ్‌లో చేరే అవకాశాలు ఉన్నాయి.
వెంకీ, అనిల్ కాంబోలో వచ్చిన ‘ఎఫ్2’, ‘ఎఫ్ 3’ తర్వాత ఈ సినిమా కూడా సూపర్ హిట్ కావడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేశ్‌లు కథానాయికలుగా నటించగా.. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు.