Nara Lokesh: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని చేజిక్కించుకోవటమే లక్ష్యంగా టీడీపీ అధిష్టానం ముందుకెళ్తోంది. అధికార పార్టీని మరోసారి గద్దెఎక్కకుండా పకడ్బందీ వ్యూహాలు రచిస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లి క్యాడర్ లో జోష్ నింపుతుండగా.. జనవరి 27 నుంచి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కూడా జనంలోకి వెళ్లనున్నారు. పాదయాత్ర పేరుతో ప్రతీ జిల్లాలో ఆయన పర్యటించి ప్రజల సమస్యలను తెలుసుకోనున్నారు. లోకేశ్ పాదయాత్రపై క్లారిటీ వచ్చినప్పటికీ ఇప్పటి వరకు ఏ రోజు నుంచి, ఎన్ని కిలో మీటర్లు పాదయాత్ర చేస్తారనేదానిపై క్లారిటీ ఇవ్వలేదు. తాజాగా లోకేశ్ తన పాదయాత్ర విషయంపై పూర్తి క్లారిటీ ఇచ్చారు.
జనవరి 27 నుంచి నారా లోకేశ్ పాదయాత్ర చేపట్టనున్నారు. మంగళగిరి నియోజకవర్గంలోని నూతక్కి గ్రామంలో బాదుడే బాదుడు కార్యక్రమం సందర్భంగా లోకేశ్ తన పాదయాత్రకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. జనవరి 27 నుంచి 400 రోజులపాటు 4వేల కిలో మీటర్లు పాదయాత్ర సాగుతుందని లోకేశ్ స్పష్టం చేశారు. తన సొంత నియోజకవర్గం మంగళగిరిలో నాలుగు రోజులు పాదయాత్ర కొనసాగుతుందని అన్నారు. పాదయాత్ర నేపథ్యంలో ఏడాదిపాటు నియోజకవర్గానికి తాను దూరంగా ఉంటానని, మంగళగిరి బాధ్యతలను మీ భుజస్కందాలపై పెడుతున్నానని, మీరు నా గెలుపు బాధ్యతను తీసుకోవాలంటూ నారా లోకేశ్ నియోజకవర్గంలోని పార్టీ నాయకులు, కార్యకర్తలకు సూచించారు.
మంగళగిరి నియోజకవర్గాన్ని టీడీపీకి కంచుకోటగా మార్చామని.. తనను ఇక్కడ ఓడించేందుకు ముఖ్యమంత్రి జగన్ చేసే కుయుక్తులను, వాడే ఆయుధాలను నియోజకవర్గ టీడీపీ నేతలు, కార్యకర్తలు సైనికుల మాదిరి ఎదుర్కోవాలని లోకేశ్ పిలుపునిచ్చారు. మంగళగిరి బాధ్యతలను మీ భుజస్కందాలపై పెడుతున్నానని… రాష్ట్రంలో టీడీపీని గెలిపించే బాధ్యతలను తాను భుజాన వేసుకోబోతున్నానని నారా లోకేశ్ అన్నారు.