తెలంగాణలో ఆరోగ్యశ్రీ(Arogyasri)సేవల నిలిపివేతకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు(Harish Rao) చేసిన విమర్శలకు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ(Damodar Rajanarasimha) కౌంటర్ ఇచ్చారు. పదేళ్లు ఆరోగ్యశ్రీని నీరుగార్చి ఇప్పుడు అదే పథకం గురించి మాట్లాడడం.. దొంగే, దొంగ దొంగ అని అరిచినట్టుగా ఉందని మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వం మిగిల్చిన అప్పులను, పెండింగ్ బిల్లుల సమస్యలను తాము పరిష్కరిస్తు ముందుకెళ్తున్నామని తెలిపారు.
బీఆర్ఎస్ పాలనలో ఆసుపత్రులకు డబ్బులు చెల్లించలేదని..సుమారు రూ.730 కోట్లు బాకీ పెట్టి పోయారని విమర్శించారు. పాత బకాయిలతో సహా ఏడాదిలో రూ.1130 కోట్లు చెల్లించామని ప్రతి నెల నిధులు విడుదల చేస్తున్నామని పేర్కొన్నారు. అయితే యాజమాన్యాలు లేవనెత్తిన ఇతర సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని స్పష్టంచేశారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆరోగ్య శ్రీ సేవల పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటున్నామని ఆయన వెల్లడించారు.