దేశవ్యాప్తంగా జేఈఈ మెయిన్ (JEE Main) పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి 6 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. జనవరి 22, 23, 24, 28, 29 తేదీల్లో ఎన్‌ఐటీ(NIT)ల్లో బీటెక్ సీట్ల భర్తీకి పేపర్-1 నిర్వహిస్తారు. 30న బీఆర్క్, బీ ప్లానింగ్ సీట్ల కోసం పేపర్-2 పరీక్ష జరుగుతుంది.
రెండు పేపర్లకు కలిపి 12 లక్షల మందికిపైగా దరఖాస్తు చేశారు. తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు లక్షన్నర మంది హాజరవుతున్నారు. హైదరాబాద్, వరంగల్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాల వద్ద సందడి నెలకొంది. పరీక్షా కేంద్రాలకు సమయానికి చేరుకునేందుకు విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు కూడా తొందరపడటంతో పలు చోట్లు ట్రాఫిక్ జామ్ అయింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎగ్జామ్ సెంటర్ల వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.