శ్రీశైల మహాక్షేత్రంలో ఉగాది మహోత్సవాలు 19.03.2023 నుండి 23.03.2023 వరకు
జరుగనున్నాయి. ఉగాది పర్వదినం 22,03,2023 రానున్నది. ఈ ఉత్సవాలకు కర్ణాటక రాష్ట్రం నుండి ముఖ్యంగా ఉత్తర కర్ణాటక ప్రాంతం మహారాష్ట్రలోని షోలాపూర్, సాంగ్జీ తదితర ప్రాంతాల నుండి భక్తులు తరలివస్తారు. భక్తులందరికీ సౌకర్యవంతమైన దర్శనం కల్పించేందుకుగాను ఉగాది మహోత్సవాలలో అనగా 19.03.2023 నుంచి 23.03.2023 వరకు భక్తులందరికీ స్వామివారి అలంకార దర్శనం మాత్రమే కల్పించడం జరుగుతుంది. ఉత్సవ రోజులలో స్వామివారి స్పర్శదర్శనానికి అవకాశం ఉండదు. అయితే ఉత్సవాల కంటే 10 రోజుల ముందు నుంచే భక్తులు శ్రీశైలాన్ని సందర్శిస్తారు. ఈ కారణంగా ఉత్సవాల ముందు నుంచే అనగా 09.03.2023 నుండి 18.03.2023 వరకు నిర్దిష్ట వేళలలో నాలుగు విడతలుగా భక్తులకు శ్రీస్వామివారి స్పర్శదర్శనానికి అవకాశం కల్పిస్తారు. ఈ స్పర్శదర్శనం టికెట్ రుసుము 500గా నిర్ణయించారు. ఒక్కొక్క విడతలో 1500 టికెట్లు మాత్రమే ఇస్తారు.
కాగా భక్తులందరికీ స్పర్శదర్శనం కల్పించినట్లయితే రోజుకు గరిష్టంగా 15వేల మందికి -మాత్రమే దర్శనాలు కల్పించగలం. అయితే ఉత్సవ రోజులలో రోజుకు సుమారు 60,000-80,000మంది దాకా భక్తులు ఆలయాన్ని సందర్శించే అవకాశం ఉంటుంది. భక్తులందరికీ సౌకర్యవంతమైన దర్శనం కల్పించేందుకుగాను ఉత్సవ రోజులలో కేవలం శ్రీస్వామివారి అలంకార దర్శనానికి (లఘుదర్శనానికి) మాత్రమే అవకాశం ఉందని ఆలయ వర్గాలు వెల్లడించాయి.
కాగా ఇప్పటికే ఈ విషయమై బాగల్ కోట్ జిల్లా రబ్మవిలో కర్ణాటక-మహారాష్ట్రలోని పలు భక్తసంఘాలు, పాదయాత్ర బృందాలు, స్వచ్ఛంద సేవాసంస్థ ప్రతినిధులతో దేవస్థానం 05.03.2023న సమన్వయ సమావేశం ఏర్పాటు చేసింది. భక్తులందరికీ అవగాహన కల్పించేందుకుగాను ఈ సమావేశంలో ఉత్సవ రోజులలో దర్శన సంబంధి ఏర్పాట్ల గురించి భక్త బృందాల ప్రతినిధులకు తెలియజేసింది.