గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం 139 మందికి పద్మ పురస్కారాలు(Padma Awards) ప్రకటించిన సంగతి తెలిసిందే. వీరిలో ఏడుగురికి పద్మ విభూషణ్, 19మందికి పద్మ భూషణ్, 113 మందికి పద్మ శ్రీ అవార్డులు దక్కాయి. ఇందులో ఏడుగురు తెలుగు వారికి అవార్డులు దక్కాయి. తెలంగాణ నుంచి ఇద్దరు, ఆంధ్రప్రదేశ్ నుంచి ఐదుగురికి పురస్కారాలు లభించాయి.
తెలంగాణ నుంచి వైద్య విభాగంలో డాక్టర్. నాగేశ్వర్ రెడ్డికి పద్మవిభూషణ్, ప్రజా వ్యవహారాల విభాగంలో మందకృష్ణ మాదిగకు పద్మశ్రీ అవార్డు లభించింది. ఇక ఏపీ నుంచి కళల విభాగంలో నటుడు బాలకృష్ణ(Balakrishna), మాడుగుల నాగఫణి శర్మ, మిర్యాల అప్పారావు (మరణానంతరం).. సాహిత్యం, విద్యారంగం నుంచి కేఎల్ కృష్ణ, వాదిరాజ్ రాఘవేంద్రాచార్యకు పద్మ పురస్కారాలు వరించాయి.
అయితే ఈ పద్మ పురస్కారాలపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy)అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం విధితమే. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన గద్దర్, చుక్కా రామయ్య, అందెశ్రీ, జయధీర్ తిరుమలరావు, గోరటి వెంకన్నల్లో ఒక్కరికీ అవార్డు ప్రకటించకపోవడం పట్ల ఆయన తీవ్ర నిరాశన వ్యక్తం చేశారు. తాజాగా పద్మ పురస్కారాలపై కాంగ్రెస్ నేత విజయశాంతి(Vijayashanthi) కీలక వ్యాఖ్యలు చేశారు. ఈమేరకు ఎక్స్ వేదికగా ఆమె పోస్ట్ చేశారు.
‘‘కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ అవార్డుల్లో తెలంగాణకు కనీసం నాలుగు అయినా వచ్చి ఉండాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యక్తపరిచిన అభిప్రాయాన్ని తప్పక పరిశీలించాల్సిన విషయం. తెలంగాణ నుంచి ఇద్దరు కేంద్ర మంత్రులు, ఎనిమిది మంది ఎంపీలున్న బీజేపీ కూడా కొంత ఆలోచన చేస్తే మంచిదే’’ అంటూ ఆమె సూచించారు.