Friday, January 31, 2025
Homeపాలిటిక్స్Mallapur: సుజిత్ రావు చేతికి జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పగ్గాలు ?

Mallapur: సుజిత్ రావు చేతికి జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పగ్గాలు ?

శివరాత్రిలోపు ప్రకటన?

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నూతన పిసిసిగా బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ నీ కాంగ్రెస్ అధిష్ఠానం నియమించింది. నూతన పిసిసి కార్యవర్గాన్ని ఇంకా పూర్తి స్థాయిలో మహేశ్ కుమార్ గౌడ్ భర్తీ చేయలేదు. పిసిసి ప్రక్షాళన ఉంటుందని, ఫిబ్రవరి మొదటి వారం లేదా శివరాత్రిలోపు పిసిసి రాష్ట్ర, జిల్లా లో పూర్తి కమిటి ఏర్పాటు చేస్తామని పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. పిసిసి అధ్యక్షుడు ప్రకటన నేపథ్యంలో జగిత్యాల జిల్లా నూతన అధ్యక్షుడు ఎవరు అవుతారని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఎదురుచూస్తున్నారు.

- Advertisement -

రేసులో ముందున్న

జిల్లా అధ్యక్షుడిగా ముందు వరసలో మల్లాపూర్ మండలం మొగిలిపేట గ్రామానికి చెందిన టిపిసిసి డెలిగేట్ సభ్యులు కల్వకుంట్ల సుజిత్ రావు పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. గత కొన్నేళ్లుగా పార్టీలో ఉంటూ పార్టీ పటిష్టత కోసం చేసిన కృషి, గత నాలుగు పర్యాయాలు టికెట్ త్యాగం చేయడం సుజిత్ వైపు అధిష్టానం ఉన్నట్లు సమాచారం. ఐటి శాఖ మంత్రి దుద్ధిళ్ల శ్రీధర్ బాబుకు దగ్గరి మిత్రుడు అవ్వడం, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, విప్ ఆడ్లూరిలు సైతం సుజిత్ పేరు ప్రతిపాదించినట్లు, అధిష్ఠానం కూడా ఒకే చెప్పినట్లు తెలుస్తోంది. రాబోయే స్థానిక ఎన్నికల్లో పార్టీని నడిపేందుకు జిల్లా బాస్ గా సుజిత్ రావు సరైన వ్యక్తి అనే పార్టీ పెద్దలు అంచనా వేస్తున్నట్టు తెలుస్తోంది. ఫిబ్రవరి మొదటి వారంలో నూతన అధ్యక్షుడి ఎంపిక ఉండబోతునట్లు కాంగ్రెస్ వర్గాలు తెలుపుతున్నాయి

సుజిత్ రావు నేపథ్యం

మల్లాపూర్ మండలం మొగిలిపేట గ్రామానికి చెందిన కల్వకుంట్ల సుజిత్ రావు 2008 వ సంవత్సరంలో కాంగ్రెస్ పార్టి లో చేరారు. పార్టీలో చేరినప్పటి నుండి పార్టీ పటిష్టత కోసం అనేక కార్యక్రమాలు నిర్వహించారు. 2009, 14, 19, 2024 లో టికెట్ కోసం ప్రయత్నించగా అధిష్ఠానం నాలుగు పర్యాయాలు జువ్వాడి కుటుంబానికి ఇచ్చింది. గత ఎన్నికల్లో జువ్వాడి, సుజిత్ రావుల మధ్య తీవ్ర పోటీ నెలకొనడంతో అధిష్ఠానం సుజిత్ రావుని ఒప్పించి జువ్వాడికి టికెట్ ఇచ్చింది. ప్రభుత్వం ఏర్పడ్డాక నామినేటెడ్ పదవి ఇస్తామని హామీ ఇచ్చింది. ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం దాటిపోయినా పూర్తి స్థాయిలో నామినేటెడ్ పదవులు భర్తీ చేయలేదు. నామినేటెడ్ పదవుల్లో ముఖ్యమైన పదవి సుజిత్ రావుకు దక్కుతుందనే వార్త నియోజకవర్గంలో చక్కర్లు కొడుతోంది. ఇప్పుడు అధిష్ఠానం సుజిత్ రావుని జిల్లా అధ్యక్షుడిగా ఎంపిక చేస్తుందని తెలపడంతో ఆయన అనుచర వర్గం సంతోషంలో ఉంది. మొన్నటి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ లలో పట్టుబట్టి మెట్ పల్లి ఛైర్మెన్ పదవి తన ముఖ్య అనుచరుడికి ఇప్పించుకున్న ఆయనకు లోకల్ గా మంచి ఇమేజ్ ఉంది. స్థానికంగా పార్టీ పటిష్టత కోసం కృషి చేయడంతో సుజిత్ రావు వైపు అధిష్ఠానం మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.

రేసులో జువ్వాడి కుటుంబం

కోరుట్ల నియోజకవర్గ ఇన్చార్జి జువ్వాడి నర్సింగరావు తమ్ముడైన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు జువ్వాడి. కృష్ణారావు జిల్లా అధ్యక్షుడిగా ఉండేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారనీ, పార్టీ కోసం పనిచేస్తున్న తనకు అవకాశం ఇవ్వాలని ప్రభుత్వ పెద్దలను కోరినట్లు సమాచారం. జువ్వాడికి ఉన్న పలుకుబడితో తన తమ్ముడైన కృష్ణ రావుకు జిల్లా అధ్యక్షుడు ఇవ్వాలని ప్రభుత్వ పెద్దలను కోరినట్లు, అధిష్ఠానం తర్జన భర్జన పడుతున్నట్లు జువ్వాడి వర్గీయులు తెలిపారు.
ఏది ఏమైనా జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టి అధ్యక్షుడిగా కోరుట్ల నియోజకవర్గ నాయకుడు ఉంటారని కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా అధ్యక్ష పదవి కోరుట్ల నియోజక వర్గ నాయకులకు వస్తుందో లేక వేరే ఎవరైనా అనుకోకుండా తెరమీదికి వస్తారో వేచి చూడాలి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News