Ind vs NZ 1st ODI : మూడు వన్డేల సిరీస్‌లో న్యూజిలాండ్ శుభారంభం చేసింది. ఆక్లాండ్ వేదికగా భారత్‌తో జరిగిన తొలి వన్డేలో ఏడు వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. 307 పరుగుల లక్ష్యాన్ని కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 47.1 ఓవర్లలోనే చేధించింది. మిడిల్ ఆర్డర్ బ్యాటర్ టామ్ లాథమ్(145 నాటౌట్; 104 బంతుల్లో 19 ఫోర్లు, 5 సిక్స్‌లు) కెప్టెన్ కేన్ విలియమ్సన్ (94 నాటౌట్; 98 బంతుల్లో 7 పోర్లు, ఒక సిక్స్) లు అభేధ్యమైన నాలుగో వికెట్ కు 221 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టుకు విజయాన్ని అందించారు. మిగిలిన బ్యాటర్లలో ఫిన్ అలెన్ 22, డేవాన్ కాన్వే 24, డారిల్ మిచెల్ 11 పరుగులు చేశారు. భారత బౌలర్లలో ఉమ్రాన్ మాలిక్ రెండు వికెట్లు తీయగా, శార్దూల్ ఠాకూర్ ఒక వికెట్ పడగొట్టాడు.
307 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్లు ఫిన్ అలెన్, డెవాన్ కాన్వే లతో పాటు డారెల్ మిచెల్‌లు తక్కువ పరుగులకే పెవిలియన్‌కు చేరారు. దీంతో 88 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి అతిథ్య జట్టు కష్టాల్లో పడింది. అయితే.. వన్‌డౌన్ బ్యాటర్, కెప్టెన్ కేన్ విలియమ్సన్ తో జత కలిసిన టాప్ లాథమ్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. ఓ వైపు విలియమ్సన్ సన్ ఆచితూచి ఆడుతుంటే లాథమ్ మాత్రం బౌండరీలతో చెలరేగాడు. భారీ శతకంతో తన జట్టుకు విజయాన్ని అందించాడు.
అంతకముందు టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 306 పరుగులు చేసింది. ఓపెనర్లు శుభ్‌మన్ గిల్(50; 65 బంతుల్లో 1ఫోర్, 3 సిక్స్‌లు), శిఖర్ ధావన్(72; 77 బంతుల్లో 13 ఫోర్లు) లతో పాటు శ్రేయస్ అయ్యర్(80; 76 బంతుల్లో4ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్థశతకాలతో రాణించారు. చివరల్లో వాషింగ్టన్ సుందర్(37నాటౌట్; 16 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) విరుచుకుపడ్డాడు.
ఈ విజయంతో కివీస్ మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. ఇరు జట్ల మధ్య ఆదివారం రెండో వన్డే మ్యాచ్ జరగనుంది.