హిందూ సాంప్రదాయంలో శకున శాస్త్రానికి చాలా ప్రాధాన్యత ఉంది. కొన్ని రకాల శకునాలు శుభప్రదమని, మరికొన్ని అశుభసూచకమని భావిస్తారు. శకున శాస్త్రం ప్రకారం కాకులకు భవిష్యత్తును ముందుగానే ఊహించే శక్తిని ఉంటుందని.. కొన్ని సంకేతాలను అవి ముందుగానే చెబుతాయని శాస్త్రం అంటోంది. ఇంతకీ అవేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.
కాకి ఒక పాత్రలో నీరు తాగడాన్ని చూస్తే.. శుభప్రదమని శకున శాస్త్రం అంటోంది. ఇలా ఎవరైనా చూస్తే వారు సమీప భవిష్యత్తులో బాగా డబ్బు సంపాదించడమో లేక గొప్ప విజయాన్ని సాధించడమో జరుగుతుందని అంటున్నారు. శకున శాస్త్రం ప్రకారం.. రెండు కాకులు తమలో తాము పోట్లాడటం వంటి దృశ్యాలను కనిపిస్తే అది అశుభం అంటున్నారు పండితులు. అంతేకాదు ఇలాంటి దృశ్యాలు చూస్తే ఇంటి యజమానికి త్వరలో కష్టాలు తప్పవంటున్నారు. ఆర్థిక సంక్షోభంలో మునిగిపోవడమో లేక ఇంట్లో విషాదం అలముకోవడమో జరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.
రోడ్డుపై వెళ్తున్నప్పుడు మీ ముందు చనిపోయిన కాకి పడితే.. అది చెడు సంకేతంగా చూడాలంట. చనిపోయిన కాకి ఒకరి మరణాన్ని ముందే తెలియజేస్తుందని అంటారు. మీరు రోడ్డుపై చనిపోయిన కాకిని చూస్తే, సమీప భవిష్యత్తులో మీ దగ్గర వారికి తీవ్ర అనారోగ్యం లేదా చనిపోవడమో జరగవచ్చని చెబుతుంటారు. అంతేకాదు కాకిని శనీశ్వరుని వాహనంగా పరిగణిస్తారు.. కాబట్టి అకస్మాత్తుగా చనిపోయిన కాకిని చూస్తే.. మీ మీద శనీశ్వరుడు కోపంగా ఉన్నాడని అర్థం చేసుకోవాలంట. భగవానుడితో పాటు మీ పూర్వీకులు కూడా మీపై కోపంగా ఉన్నారని అర్థం చేసుకోవాలని పండితులు అంటున్నారు.
అయితే ఇలాంటి సందర్భాల్లో కొన్ని పరిహారాలు కూడా పాటించవచ్చని పండితులు అంటున్నారు. చనిపోయిన కాకి కనిపిస్తే వెంటనే శని దేవుని ఆలయానికి వెళ్లి.. అపరాధ నమస్కారాలు చేసుకొని.. స్వామికి నువ్వుల నూనెతో అభిషేకం చేయాలని.. అప్పుడు శనీశ్వరుడు కోపం చల్లారుతుందని చెబుతున్నారు. (గమనిక: ఈ సమాచారం మతం, శాస్త్రం ఆధారంగా మరియు జ్యోతిష్కులు మరియు ఆచార్యులు తెలిపినది. దీనిని తెలుగు ప్రభ ధృవీకరించడం లేదు.)