మరికొద్ది గంటల్లో ఢిల్లీ కా బాద్ షా ఎవరో తేలిపోనుంది. దేశ రాజధానిని పాలించేది సింగిల్ ఇంజిన్ ప్రభుత్వమా.. డబల్ ఇంజిన్ ప్రభుత్వమా అని తేలిపోనుంది. అయితే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల(Delhi Elections) ఫలితాలకు ముందు సంచలన పరిణామం చోటు చేసుకుంది. ఏసీబీ(ACB) అధికారులు ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్(Kejriwal)కు నోటీసులు అందజేశారు. 16 మంది ఆప్ అభ్యర్థుల కొనుగోలుకు బీజేపీ ప్రయత్నిస్తోందని కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో లెఫ్టినెంట్ గవర్నర్ వీకే.సక్సేనా ఈ ఆరోపణలపై ఏసీబీ విచారణకు ఆదేశించారు. గవర్నర్ ఆదేశాలతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు కేజ్రీవాల్ నివాసానికి చేరుకుని విచారణకు హాజరుకావాలని నోటీసు ఇచ్చారు. ఈ ఆరోపణలపై ఆధారాలు సమర్పించాలని కోరారు.
కాగా పార్టీ ఫిరాయిస్తే మంత్రి పదవులతో పాటు ఒక్కొక్కరికి రూ.15 కోట్లు ఇస్తామని 16 మంది ఆప్ అభ్యర్థులకు బీజేపీ నుంచి ఆఫర్లు వచ్చాయని కేజ్రీవాల్ ఆరోపించారు. డబ్బులు ఇచ్చి తప్పుడు సర్వేలు చేయిస్తుందని.. అందుకే బీజేపీ గెలుస్తుందంటూ లేనిపోని కథనాలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. మరోవైపు కేజ్రీవాల్ ఆరోపణలను బీజేపీ తీవ్రంగా ఖండించింది. పరువు నష్టం కలిగించేవిగా ఉన్నాయని మండిపడింది. కాగా మెజార్టీ ఎగ్జిట్ పోల్స్‌లో బీజేపీ అధికారంలోకి వస్తుందని తేలింది. మరి శనివారం విడుదలయ్యే ఫలితాల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనే ఉత్కంఠ దేశవ్యాప్తంగా నెలకొంది.