ప్రధాని మోదీ(PM Modi)పై నమ్మకంతోనే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ(BJP) ఘన విజయం సాధించిందని ఏపీ సీఎం చంద్రబాబు(Chandrababu) తెలిపారు. ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై మీడియాతో మాట్లాడుతూ.. ఢిల్లీ ప్రజలు విజ్ఞతతో ఓటు వేసి బీజేపీని గెలిపించారన్నారు. ఇది దేశ ప్రజల ఆత్మ గౌరవానికి సంబంధించిన గెలుపు అని పేర్కొన్నారు. ఆప్ పాలనలో ఢిల్లీలో ఎక్కడ చూసినా చెత్త పేరుకుపోయిందని విమర్శంచారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను ఆప్ ప్రభుత్వం వినియోగించుకోలేదన్నారు. దీంతో ఢిల్లీ ప్రజలు కొన్ని పథకాల్లో లబ్ధి పొందలేకపోయారన్నారు. ఒకప్పుడు పంజాబ్‌కు అన్ని రంగాల్లో మంచి పేరుండేదని.. ఇప్పుడు ఆప్ సర్కార్‌లో డ్రగ్స్ అడ్డాగా మారిపోయిందన్నారు.
ఢిల్లీ లిక్కర్ పాలసీపై అక్కడి ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. అలాగే ఏపీలోనూ వైసీపీ పాలనలో మద్యం మాఫియా తయారైందన్నారు. ఈ పాలసీలతో ఓటేసిన పాపానికి ప్రజల భవిష్యత్తును కాటేశారని మండిపడ్డారు. సంపద సృష్టించలేని, ప్రభుత్వానికి ఆదాయం పెంచలేని నేతలు ఎందుకు? అని ప్రశ్నించారు. ఏపీ, ఢిల్లీ ప్రజలు తమ తప్పు తెలుసుకుని కష్టాల నుంచి బయటపడ్డారని చంద్రబాబు వెల్లడించారు. కేంద్రంతో పాటు రాష్ట్రాల్లో మంచి నాయకత్వంలో ముందుకెళ్తే 2047 నాటికి భారత్ అగ్రస్థానంలో ఉంటుందన్నారు.