బీఆర్ఎస్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. గతంలో మంత్రిగానూ పనిచేసినా, సీనియర్ రాజకీయ నాయకుడు కూడా అయిన స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే రాజయ్య వివాదాల్లో ఉంటారు.
జానకీపురం మహిళా సర్పంచ్ నవ్య చేసిన ఆరోపణలపై మహిళా కమిషన్ స్పందిస్తూ సుమోటో కేసుగా రాజయ్యపై ఆరోపణలు స్వీకరిస్తూ ట్వీట్ చేసింది. దీంతో రాజయ్యపై మహిళా కమిషన్ చర్యలు తీసుకునేందుకు ఉపక్రమించింది. ఇందులో భాగంగా డీజీపీకి మహిళా కమిషన్ ఆదేశాలు జారీచేస్తూ రాజయ్యపై వ్యక్తిగత విచారణ చేపట్టాలంది. ఈమేరకు కమిషన్ ఛైర్మన్ సునీతా లక్ష్మారెడ్డి వెల్లడించారు.
రాజయ్య తనను లైంగికంగా వేధిస్తున్నాడంటూ సర్పంచ్ నవ్య ఆరోపించారు. కాగా గతంలోనూ రాజయ్యపై ఇలాంటి ఆరోపణలు చాలానే వెల్లువెత్తాయి. పైగా కొన్ని వీడియోలు, ఫోటోలు కూడా వెలుగులోకి చాలాసార్లు వచ్చినా పార్టీ అధిష్టానం పెద్దగా ఖాతరు చేయలేదు.
అయితే తన రాజకీయ ప్రత్యర్థులు, సొంత పార్టీలోని గిట్టని వాళ్లు చేసే ప్రచారమే ఇదంతా అంటూ రాజయ్య ఇంతకాలం కథలు చెబుతూ వచ్చారు. కానీ తాజాగా ఆయనపై గట్టి చర్యలు తీసుకునేలా కనిపిస్తోంది.