Friday, November 22, 2024
Homeఓపన్ పేజ్Koppula: తెలుగు సాహిత్యానికి అక్షర పూమాల కొప్పుల వారి కవిత్వం

Koppula: తెలుగు సాహిత్యానికి అక్షర పూమాల కొప్పుల వారి కవిత్వం

‘అక్షరమే నా సాంస్కృతి నా ఆలోచనలే కవితా కుసుమాలు …
నిత్య నైవేద్యముగా తెలుగు తల్లికి ప్రతి నిత్యం అక్షరా భిషేకం
తెలుగు భాష పట్ల ఎంతటి మమకారమో కదా! కొప్పుల వారికీ.
నేడు తెలుగు భాషలోనే వాడుకలో ఉన్న అక్షరాలు 56.అందుకేనేమో ఈ కవితా సంపుటిలో 56 కవితల్తో ముస్తాబయింది.
‘నేనొక అక్షర పిపాసిని
నిరంతర అక్షర తపస్వి నీ
అక్షర యజ్ఞంలో ఇంధనమై నేనూ
జీవం ఉన్నంతవరకూ వెలుగుతుంటాను ..’
ఇది కదా!
నేను కవిని.కవిత్వమే నా శ్వాస అని సగర్వంగా చాటుకునే విధానం.
తాను కరిగిపోతూ, సాహిత్య వనంలో చిరు దివ్యగా వెలిగిపోవాలనే వీరి తృష్ణ శ్లాఘనీయం.
కవిత్వానికి (సాహిత్యానికి) సామాజిక ప్రయోజనం ఉండాలని, అభ్యుదయానికి, వికాసానికి దారి తీయాలని, కవులు, రచయితలు, కళాకారులు ఇందుకు శ్రమించాలని, వారికి ఆ అదనపు సామాజిక బాధ్యత ఉందని, ఎంతో కాలంగా విమర్శకులు గొంతు చించుకుని చెపుతున్న మాటలు.
ఆ మాటలను తన రచనల్లో సరికొత్తగా ఆవిష్కరిం చారు కొప్పుల ప్రసాద్‌ గారు.
హృదయాన్ని హత్తుకునేలా శీర్షిక, అంతేకాదు అందంగా ముస్తాబైన ముఖచిత్రంతో కొప్పుల వారి మస్తిష్క మథనమే ఈ ‘చిరుగాలి పలకరిస్తే’ కవితా సంపుటి.
‘చిరుగాలి పలకరిస్తే .. కవితలు హృదయాన్ని తాకి ఉల్లాసాన్ని కలుగజేస్తాయి. ప్రకృతిలో విహరించిన అను భూతిని కలిగిస్తాయి. కవి సమాజంలోని అన్ని కోణాల లోనూ సృజించాడు. కొన్ని కవితల్లో భావ కవిత్వం, అభ్యు దయ కవిత్వం, విప్లవ కవిత్వం, ప్రకృతి కవిత్వం మనకు దర్శనమిస్తుంది..
సంపుటిలోని మొదటి కవిత అక్షర పరిమళాలు … నా అక్షరాలకు ఊహల్లో రెక్కలు వచ్చి సాహిత్య వీధుల్లో విహరిస్తున్నాయి.. అంటూ సంపుటి మొదటి కవితలను ప్రారంభించారు కొప్పుల వారు. సాహిత్యంలో శాశ్వత కీర్తి పొందాలని వారు అక్షరాలను ఎంత చక్కగా చెక్కుకున్నది ,తెలుగు భాష పట్ల వారికున్న మక్కువ, తపన ఇక్కడ నుండే మనకు అర్థమవుతుంది .
కొప్పుల ప్రసాద్‌ గారి మాటల్లో
‘మనసులో పలికే భావోద్వేగాలను అక్షర రూపంలోకి అందించాలనే తాపత్రయముతో మొదట్లో చిన్న చిన్న ప్రాస కవితలను రాసుకునేవాన్ని. పేదరికం నేర్పిన అనుభవాల లోనించి పుట్టిన అక్షర రూపాలే నా కవితా కుసుమాలు, ఆవేశములోనూ ఆనందములోనూ పుట్టిన భావాలు.
చూసిన్వి, చదివినవి, విన్నవి, మనస్సులో సంఘర్షణ పడి అక్షర రూపంలో వెలుగు చూసినవి నా కవితలు. ప్రతి విషయాన్నీ కవితల్లో స్పందిస్తూ నిత్య ప్రయాణం కొన సాగిస్తున్నా.
ఈ ప్రయాణంలో సాహితీ జగత్తులో మరపురాని జ్ఞాపకమై నిలవాలని ఆశతో… రాస్తుంటాను అంటారు.
తెలుగు సాహిత్యానికి సేవ చేసుకోవాలనే తపన వీరి కవిత్వంలో కనిపిస్తుంది.
తెలుగు భాషాభివృద్ధికి నేటి కవులు ఎంతగానో కృషి చేస్తున్నారు.
అందుకు నిదర్శనమే నేడు వెలువడుతున్న అనేక ప్రక్రి యల్లో కవితా సంపుటాలు, సంకలనాలు .
ఒక కవిత పది కాలాలు మన్నన పొందాలి అంటే ఆ కవిత్వంలో సాంస్కృతిక అభివృద్ధి, నాగరికత, ప్రజా జీవ నాన్ని ప్రతిబింబించే భాష, భావవ్యక్తీకరణ చాలా ముఖ్యమైనవి.
కొప్పుల ప్రసాద్‌ గారు సమాజం వైపు సంధించిన అక్షర శరములు ఈ కవితలో మీరు చూడవచ్చు.
పథకాల మాయాజాలం
కురుస్తున్నాయి పథకాల జల్లులు
తడుస్తున్నాయి సామాన్యుల జేబులు
పెరుగుతున్నాయి ధరాఘాతం చిల్లులు విలవిలలాడు తున్నారు సగటు మనుష్యులు …
ఓట్ల కోసం వేస్తున్నారు ఎర్రను అంటించిన గాలం ఆనందంగా మ్రింగితే అనుభవిస్తారు
బాధలు పథకాల మాయాజాలం
వైకుంఠపాళి ఆట
నిచ్చెన ఎక్కిన పాము నోట్లో చిక్కి నట్లే …
అనే కవిత్వం నేటి రాజకీయ పరిస్థితులకు దర్పణం.
ఉచ్చితాలకోసం ఓటర్‌ వ్యంపర్లాట.
అవకాశంగా తీసుకునే ప్రజానాయకులు.
వరాల జల్లు కురిపిస్తారు.
ఐదు సంవత్సరాలు నిరంతరంగా ప్రతి రోజూ ఏదోక విధంగా, ఇచ్చిన ఉచ్చితాలకు పదింతలు గుంజుతూనే ఉంటారు.
నిత్యావసరాల సరుకులు నుండి తల దాచుకునే నివాసాలు వరకు పన్నులు, ట్యాక్స్‌లో రూపంలో ముక్కు పిండి మరీ వసూలు చేస్తుంటారనే విషయాన్ని, ప్రజలు మేల్కోవలసిన ఆవస్యకతను వివరించిన కవిత్వం ఇది.
‘అక్షరాల వెలుగు దివ్వెల పట్టుకొని
లోకమంతా పహరా కాస్తూ
చీకటి శక్తులను అణిచివేసేందుకు
కవిత్వమునే అస్త్రంగా వదులుతున్నాను..’
చిక్కనైన తెలుగు పదాలు కవిత్వం.
అన్యాయాలను అక్రమాలను తన కలం ద్వారా పెకి లించాలని, సమాజాన్ని శాంతియుత నందన వనంలా మార్చాలనే భావం.. నిగూఢంగా నింపుకున్న కవిత్వం.
ఇక్కడ శ్రీశ్రీ గారి కవిత్వం చాయలు వినిపి స్తుంటాయి..
‘నేను సైతం ప్రపంజాన్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చానూ అనే కవిత మనకు గుర్తుకు రాకమానదు.
కొప్పుల ప్రసాద్‌ గారు స్వతహాగా ఉపాధ్యాయులు కావడం, వారికి భాష పట్ల పట్టు, మమకారం ఉన్నందున ప్రతి కవిత అక్షర సౌరభాలు వెదజల్లుతుంది.
ఇది మాతృభాష అధ్యయనం వల్ల కంఠస్థం చేయడం వల్లనే సాధ్యమౌతుంది.
కొన్ని అనుభూతులు అకస్మాత్తుగా మనల్ని కదిలి స్తాయి. మరి కొన్ని క్రమంగా మనసులో రూపు దిద్దుకుం టాయి. కానీ, ఈ ఊహలకి నిర్దిష్టమైన ఆకారం ఉండదు. వీటిని వేరొకరితో పంచుకోవడానికి మాట ఒక్కటే మార్గం. అయితే ఎప్పుడు వాటిని పదాలలో, వాక్యాలలో పెడ తామో, అప్పుడు అవి ఒక స్పష్టమైన ఆకృతి తెచ్చుకుం టాయి. అందమైన కవిత్వంగా సంతరించుకుంటుంది.
అది తను నిత్యం చూస్తున్న, వింటున్న యదార్థ సం ఘటనలను తలచుకుని, సగటు మనిషి కన్నీటిని అర్దం చేసుకుంటూ వ్రాసిన కవిత ఇక్కడ మీ కోసం.
ఎంతని మధించను .. !!
కన్నీటి సంద్రంలో జీవన యానం.దినదినం ఉపాధి వెతుకులాట.కదిలిస్తే హృదయం తరుక్కః పోయే వ్యాధు లను తోడు చేసుకున్న అభాగ్యులు చూసిన’
మనసుతో వ్రాసిన కవిత ఇదేనేమో అనిపిస్తుంది
‘ఎంతని మధించను మదిని
కన్నీటి చుక్కల దాహం కోసం ఎడారిలో నీటికోసం తిరిగినట్లు
తడి ఆరిన హృదయాన్ని ఎలా నింపగలను …’
కన్నీరు ఎండిపోయి, జీవం కోల్పోయిన కన్నుల్లోని వ్యధను అర్థం చేసుకోవడం కొప్పుల ప్రసాద్‌ గార్కి మాత్రమే సాధ్యం అనిపించే కవిత ఇది.
అలా ఆకృతి దాల్చిన కవిత్వమే కొప్పుల ప్రసాద్‌ గారి ‘చిరుగాలి పలకరిస్తే’ కవితా సంపుటి.
శ్రీశ్రీ గారి కవిత్వం ఎందరినో ప్రభావితం చేసింది అనేది వాస్తవం. శ్రీశ్రీ గారిలా ఒక్క కవిత అయినా వ్రాయాలి అని ప్రయత్నించే యువ కవులకు కొదవే లేదు.

శ్రీశ్రీ గారి కవిత్వం..
ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వ కారణం.
అనే కవిత్వం కొప్పుల వారిని చాలా ప్రభావితం చేసిందేమో అనిపిస్తుంది .
మీరు కూడా నా అభిప్రాయం సరైనదే అంటారు
కొప్పుల వారి ఈ కవిత ఒక్కసారి పరిశీలిస్తే.
చరిత్రలో నూతన అధ్యాయం … !!
యుద్ధాల తారీకులు దస్తావేజుల పుట్టుకలు సామా న్యులకు సమస్యలు చరిత్ర నేర్పిన పాఠాలు …
కాలానికి నల్లని మరకలు ప్రపంచానికి దొరల పాలన దోపిడీకి పుట్టిన వ్యవస్థలు దొడ్డిదారిన తీర్మానాలు ఎన్నో …
పేదరికపు అవయవ దానం చరిత్రలో బలి చేసిన మహాదానం అహంకారం జ్వాలలకు ఆరిన చిరు దీపాల బ్రతుకులు …
రాలి పడిన కన్నీటి చుక్కలు
ఆకలి కేకల దాహములో
మాయాజాలం మార్కెట్లో అమ్మబడిన యవ్వనపు ఛాయలు ..
పేదవాడి జీవనం దుర్భరంగా సాగుతుంటే.
ఉన్నవాడు ధనంతో అవయవాలను కొనుగోలు చేస్తుంటే.ఆకలిని జయించలేని వారు తమ అవయవాలనే అమ్ముకునే పరిస్థితి మన భారతావనిలో..
నిత్యం ఎక్కడో ఒక మూల జరుగుతూనే ఉంది.
దీనికి బాధ్యులు ఎవ్వరు..
ప్రశ్న చిన్నదే..
సమాధానం కోసం చరిత్ర తిరిగేయక తప్పదు.
నా మిత్రుడు ,కవి, స్నేహశీలి అయిన కొప్పుల ప్రసాద్‌ గారిని మనసారా దీవించండి.
వారి కవితా సంపుటి కొని, చదివి, మరో సంపుటి ప్రచురణకు చేయూత నివ్వండి.
రాము కోలా
9849001201

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News