ఏలూరు జిల్లా దెందులూరు(Denduluru)లో ఒక్కసారిగా రాజకీయాలు వేడెక్కాయి. గత ఐదేళ్లు వైసీపీ పాలనలో టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్‌పై పదుల సంఖ్యలో పోలీసు కేసులు నమోదైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కొన్ని నెలల పాటు జైలు జీవితం కూడా గడిపారు. వైసీపీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి తనపై తప్పుడు కేసులతో ఇరిక్కిస్తున్నారని చింతమనేని ఆరోపించారు. అయితే 2024 ఎన్నికల్లో చింతమనేని మరోసారి దెందులూరు ఎమ్మెల్యేగా గెలుపొందారు. రాష్ట్రంలో కూడా టీడీపీ అధికారంలోకి వచ్చింది. దీంతో టీడీపీ క్యాడర్ యాక్టివ్ కాగా… వైసీపీ క్యాడర్ సైలెంట్ అయిపోయింది.
ఇదిలా ఉండగానే బుధవారం రాత్రి ఓ వేడుకలో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్(Chinthamaneni Prabhakar) కారుకు మాజీ ఎమ్మెల్యే అబ్చయ్య చౌదరి(Abbaiah Chowdary) వాహనాన్ని అడ్డు పెట్టారు. దీంతో అబ్చయ్య చౌదరి కారు డ్రైవర్‌పై చింతమనేని తీవ్ర దుర్భాషలాడారు. పరస్పరం ఒకరిపై ఒకరు ఆరోపణలు చేస్తున్నారు. కావాలనే అబ్బయ్య చౌదరి గొడవలకు ప్రేరిపిస్తున్నారని.. కవ్వింపు చర్యలకు పాల్పడితే ఊరుకోవాలా అని చింతమనేని మండిపడ్డారు. మరోవైపు అబ్చయ్య చౌదరి కూడా మాట్లాడుతూ.. తనను, తన కుటుంబాన్ని అంతమొందించే కుట్ర చేస్తున్నారన్న అనుమానం కలుగుతోందని ఆరోపణలు చేశారు. తమపై చింతమనేని కక్ష సాధింపులకు దిగారని తెలిపారు. ఈ పరిణామాలతో దెందులూరులో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా అలర్డ్ అయ్యారు.