శ్రద్ధా వాకర్- అఫ్తాబ్. ఇప్పుడీ పేర్లు తెలియని వారు లేరు. ఈమె హత్యోదంతం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. హత్య జరిగిన ఆరు నెలలకు విషయం బయటికి రావడంతో.. ఈ కేసులో ఆధారాలను సేకరించడం పోలీసులకు సవాలుగా మారింది. హత్య తర్వాత ఆమెను 35 ముక్కలుగా నరికి, ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసి.. రోజుకో ప్రాంతంలో వాటిని పడేస్తూ వచ్చాడు అఫ్తాబ్. వాటిని వెతకడం కోసం నానా తంటాలు పడుతున్నారు. ఇటీవల ఓ చెరువులో శ్రద్ధ కు సంబంధించిన కళేబరాలు ఉన్నాయని తెలియడంతో.. ఆ చెరువులోని నీటిని ఖాళీ చేయించి వాటికోసం వెతికారు.
తాజాగా.. ఈ కేసులో మరో పురోగతి సాధించారు. శ్రద్ధను నరకడానికి వాడిన ఐదు కత్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. హత్యకు వాడిని మరో ఆయుధమైన రంపం ఇంకా లభ్యం కాలేదని వెల్లడించారు. స్వాధీనం చేసుకున్న కత్తులు ఒక్కొక్కటి 5-6 అంగుళాల పొడవు ఉన్నట్లు వివరించారు. వాటిని ఫోరెన్సిక్ పరీక్షలకు పంపామన్నారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా.. శ్రద్ధ- అఫ్తాబ్ ల సోషల్ మీడియా ఖాతాల నుండి కూడా ఆధారాలు సేకరించిన విషయం తెలిసిందే. ఒక డేటింగ్ యాప్ ద్వారా ఒకరికొకరు పరిచయమై 2019 నుండి సహజీవనం చేస్తున్నారు. 2020 నుండే ఆమెకు అఫ్తాబ్ నుండి వేధింపులు మొదలయ్యాయి. తీవ్రంగా కొట్టేవాడని వాట్సాప్ లో తన మేనేజర్ కరణ్ తో శ్రద్ధ చేసిన చాటింగ్ కీలక ఆధారమైంది.