ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాకు వెళ్లే ప్రయాణికులు న్యూఢిల్లీ రైల్వేస్టేషన్ (Delhi Railway Station) పోటెత్తడంతో శనివారం రాత్రి తొక్కిసలాట జరిగిన సంగతి తెలిసిందే. ఈ తొక్కిసలాటలో 18 మంది మరణించగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో 11 మంది మహిళలు, నలుగురు చిన్నారులున్నారు. ఈ నేపథ్యంలో రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్(Ashwini Vaishnaw) వెంటనే రాజీనామా చేయాలని నెటిజన్లు సోషల్ మీడియాలో డిమాండ్ చేస్తున్నారు. ఈమేరకు #AshwiniVaishnawResignNow హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేస్తున్నారు.
అశ్విని వైష్ణవ్ రైల్వే శాఖ మంత్రి అయినప్పటి నుంచే రైలు ప్రమాదాల సంఖ్య పెరిగిందని పోస్టులు పెడుతున్నారు. రైలు ప్రమాదాల్లో ఇప్పటికే చాలా మంది చనిపోయారని వాపోతున్నారు. తక్షణమే ఈ రైలు ప్రమాదాలకు బాధత్య వహించి రైల్వే మంత్రి రాజీనామా చేయాలని ట్రెండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో 1956లో అరియలూర్‌లో జరిగిన రైలు ప్రమాదం తర్వాత ఆ ప్రమాదానికి బాధత్య వహిస్తూ నాటి రైల్వే మంత్రి లాల్ బహదూర్ శాస్త్రి రాజీనామా చేసిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు.
అలాగే 1999 ఆగస్టులో అస్సాంలో గైసల్ రైలు ప్రమాదంలో దాదాపు 290 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన తర్వాత రైల్వే మంత్రి నితీష్ కుమార్ తన పదవికి రాజీనామా చేశారు. ఇక 2000 సంవత్సరంలో రెండు రైలు ప్రమాదాలు జరగడంతో మమతా బెనర్జీ నైతిక బాధ్యత వహిస్తూ తన పదవికి రాజీనామా చేశారు. అయితే అప్పటి ప్రధాని అటల్ బిహార్ వాజ్‌పేయి ఆమె రాజీనామాను ఆమోదించలేదు. కానీ తన హయాంలో ఇన్ని ప్రమాదాలు జరుగుతున్నా అశ్విని వైష్ణవ్ ఎందుకు రాజీనామా చేయడం లేదని నిలదీస్తున్నారు.