ఈ వేసవిలో ఎండ తీవ్రంగా ఉంటుందని, ఉష్ణోగ్రతలు గత రికార్డులను తిరగరాసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేడి సంవత్సరంగా గత ఏడాది నమోదైందని, ఈ ఏడాది కూడా ఉష్ణోగ్రతల్లో కొత్త రికార్డుల నమోదుకు అవకాశాలున్నాయని అంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలో వస్తున్న మార్పులే ఇందుకు కారణమని చెబుతున్నారు.
మరో వైపు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం పగటి ఉష్ణోగ్రతలు 35.7 నుంచి 37.7 డిగ్రీల మధ్య నమోదు అయ్యాయి.రానున్న మూడు రోజుల్లో ఈ ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఖమ్మం జిల్లా రావినూతలలో 37.7 డిగ్రీల ఉష్ణోగ్రత గరిష్టంగా నమోదైంది. జనగామలో 35.7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు అయ్యింది. పెద్దపల్లి 37.6, భద్రాద్రి, జగిత్యాల ,జోగులాంబ గద్వాల తదితర జిల్లాల్లో 37.5 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదు అయినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.
ఫిబ్రవరిలోనే ఎండలు దంచికొడుతుండగా మార్చి 15 తర్వాత ఉష్ణోగ్రతలు భారీగా పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే తెలంగాణలో ఉష్ణోగ్రతలు రోజురోజుకు అధికమౌతుంది. గడిచిన వారం రోజులలో మహబూబ్‌నగర్, ఆదిలాబాద్, రామగుండం, ఖమ్మం జిల్లాల్లో సాధారణం కంటే 3 డిగ్రీలు అధికంగా నమోదయ్యాయి. ఫిబ్రవరిలోనే ఎండలు మండిపోతే, ఏప్రిల్, మే నాటికి మరింత తీవ్రస్థాయికి చేరుకుంటాయని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇటు ఏపీలో కూడా 30 డిగ్రీల కంటే ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి.
Weather report: ఈ సారి తెలుగు రాష్ట్రాల్లో సెగలే!
- Advertisement -