కాకినాడ జిల్లా తుని(Tuni)లో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. తుని పురపాలక సంఘం ఉపాధ్యక్షుడు ఎన్నిక వాయిదా పడటంతో వైసీపీ నేతలు ఛలో తుని కార్యక్రమానికి పిలుపునిచ్చారు. దీంతో ఈ కార్యక్రమానికి అనుమతి లేదంటూ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. వైసీపీ నేతలు, కార్యకర్తలను ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నారు. కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం రెడ్డి కాకినాడ నుంచి తుని బయలుదేరగా పోలీసులు ఆయన కారును అడ్డుకున్నారు. దీంతో అనుచరులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు.
అలాగే తుని బయలుదేరిన మాజీ ఎంపీ వంగా గీతను కూడా అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు టీడీపీ నేతలపై కూడా పోలీసులు నిఘా పెట్టారు. దీంతో తునిలో హైటెన్షన్ నలెకొంది. ఈ పరిణామాల నేపథ్యంలో మున్సిపల్ కార్యాలయం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. సోమవారం నిర్వహించాల్సిన ఉపాధ్యక్షుడి ఎన్నిక కోరం లేక నేటికి వాయిదా పడింది. దీంతో ఈ ఎన్నికను టీడీపీ, వైసీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.