సాధారణంగా నిద్రలో ఎన్నో కలలు కంటుంటారు. వాటిలో కొన్ని గుర్తుంటాయి. కొన్ని గుర్తుండవు. కొన్ని కలలు పీడకలల్లా వచ్చి… నిద్రను చెడగొడతాయి. మరికొన్ని కలలు మనల్ని ఆలోచనలో పడేస్తాయి. ముఖ్యంగా డ్రీమ్‌లో రెండు రకాలు ఉంటాయంటున్నారు నిపుణులు. గతంలో జరిగిన సంఘటనల ఆధారంగా కొన్ని కలలు వస్తే.. భవిష్యత్తులో జరగబోయే అంశాలపై వచ్చివే మరికొన్ని. అయితే కలలో వినాయక స్వామి వస్తే దాని అర్థమేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.
హిందూ దేవతా మూర్తుల్లో వినాయకుడికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఏ పూజ చేయాలన్నా వినాయకుడిని ముందు ప్రార్ధిస్తారు. వినాయకుడు విఘ్నాధిపతి. ఆ స్వామి కలలోకి వస్తే… మనకు విఘ్నాలు, ఆటంకాలూ తొలగిపోయి శుభాలు కలుగుతాయని చెబుతున్నారు పండితులు. శివపార్వతుల తనయుడైన గణపతి అంటే అందరికీ భక్తే. ఏటా గణపతి నవరాత్రులను ప్రపంచవ్యాప్తంగా అట్టహాసంగా జరుపుకుంటారు. కొత్త కార్యక్రమాలు ప్రారంభించాలనుకునే భక్తులు… తమకు ఏ విఘ్నాలూ కలగకుండా దీవించమని స్వామిని కోరుకుంటారు. హిందువులు ఏ కార్యం తలపెట్టినా ముందుగా వినాయక స్వామికి పూజ చేస్తారు. తర్వాతే ఇతర దేవుళ్ల పూజలు జరుపుతారు. కారణం ఏ విఘ్నాలూ జరగకుండా చూడమనే. అందుకే గణపతి పూజకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఎవరికైనా కలలో బొజ్జగణపయ్య కనిపిస్తే ఇక వారు విజయం సాధించబోతున్నారని అర్థమట.
గణేశుడు అంటే శుభానికి ప్రతిరూపం. మంచితనానికి మారుపేరు. కలలోకి గణేశుడు వస్తే ఆ స్వామి ఆశీస్సులు మీపై ఉన్నట్లేనట. ఇక మీ జీవితంలో అన్నీ శుభాలే ఉంటాయని పండితులు అంటున్నారు. వినాయకుడు కలలోకి కనిపించిన వారికి జీవితం ఆనందమయంగా సాగుతుందని చెబుతున్నారు. ఏకదంతుడు కలలో కనిపిస్తే ఇక మీరు వెంటనే కొత్త ప్రాజెక్టు, కొత్త కార్యక్రమం ప్రారంభించవచ్చు. అలా మీరు ప్రారంభించేలా మీ మనసంతా సంతోషంతో నిండిపోతుందని అంటున్నారు.
మీరు ఏదో మంచి కార్యం తలపెట్టి ఇతర పనుల వల్ల దాన్ని మర్చిపోతే… అప్పుడు మీకు మహా గణపతి కలలో కనిపించే అవకాశాలుంటాయంటున్నారు నిపుణులు. అంటే మీ బాధ్యతను స్వామి మీకు గుర్తుచేస్తున్నారని అర్థం. ఎవరైనా ఎవరికైనా మంచి విషయాలపై ప్రామిస్ చేసి మర్చిపోతే… వాటిని కచ్చితంగా నెరవేర్చాలి. లేదంటే స్వామి కలలో కనిపించి గుర్తుచేస్తారంటున్నారు నిపుణులు. (గమనిక: ఈ కథనం ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. దీనిని తెలుగు ప్రభ ధృవీకరించడం లేదు.)